రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు చిరంజీవిని పంపుతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో రాష్ట్రపతి కోటాలో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా ఈ కోటాలో రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కోటాలోనే ఎంపీ అయ్యారు. ఆయన బీజేపీ సభ్యత్వం తీసుకోలేదు. ఈ కోటాలో ఎంపికయ్యే వారు అనధికారికంగా బీజేపీకి మద్దతుగా ఉంటారు కానీ.. అధికారికంగా ఏ పార్టీ సభ్యులు కారు.
చిరంజీవి రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభకు పంపాలంటే ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు. బీజేపీలో కూడా చేరాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో ఆయన పద్మవిభూషణ్ కూడా పొందారు కాబట్టి నామినేట్ అవడానికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. మోదీ కి చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం కూడా ఉంది. అందుకే రాజ్యసభకు నామినేట్ చేసే చాన్సులు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంటోంది.
నాగబాబును రాజ్యసభకు పంపలేదు. ఇప్పుడు కాకపోతే మరో ఏడాది తర్వాత అయ్యే ఖాళీలతో పంపవచ్చు. కానీ ఆయనను రాష్ట్రంలోనే ఉంచడానికి కారణం చిరంజీవిని రాజ్యసభకు పంపాలన్న ఆలోచనతోనేనని ఇప్పుడు కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఇద్దరు సోదరులు రాజ్యసభకు వెళ్తే బాగుండదన్న ఉద్దేశంతో నాగబాబును ఆపారని కూడా భావిస్తున్నారు. మొత్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను రాష్ట్రపతి భర్తీ చేస్తే క్లారిటీ వస్తుంది.