వైసీపీకి రాజీనామాలు చేస్తున్న వారు రెండు పూటలా ఉంటున్నారు. ఉదయం ఒకరు.. మధ్యాహ్నం ఒకరు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. మంచి రోజులు వస్తాయని పార్టీ హైకమాండ్ నుంచి బుజ్జగింపులు వస్తున్నా.. మీకో దండం అంటున్నారు. ఈ రాజీనామాలు ఇప్పుడల్లా ఆగేవి కావని వైసీపీ నేతలకూ తెలుసు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వైసీపీలో ముఖ్య నేత అనేవారు ఉంటారని అనుకోవడం లేదు. అందరూ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. చేర్చుకుంటానంటే వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నారు.
ఇప్పటికే పార్టీలో ఉన్నామని అనిపిస్తున్నారు కానీ.. ఒక్క మాట మాట్లాడేందుకు సిద్దంగా లేని వారు ఎందరో ఉన్నారు. వారందరివీ పక్క చూపులే. రాబోయే రోజుల్లో మరింత మంది రాజీనామాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వీరందరూ రాజకీయ సన్యాసం ప్రకటించే అవకాశం కనిపించడంలేదు. ఏదోక పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీలు ఏవి అన్నది సస్పెన్స్ గామారింది.
నిజానికి ఏదో ఓ పార్టీతో మాట్లాడుకున్న తర్వాతనే రాజీనామాలుచేస్తున్నారని అనుకోవచ్చు.ఏ పార్టీతో మాట్లాడుకున్నారన్నది మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. అదే సమయంలో ఉన్న పళంగా ఏదో ఓ పార్టీలో చేరిపోయే అవకాశం కూడా లేదు. సరైన సమయం కోసం కూటమి పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ వైసీపీకి చిన్న చిన్న షాకులేనని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు అసలు లీడర్లు రెడీగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.