అనర్హులైన వారి పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా తీసేయాలని చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. అదే సదస్సులో చంద్రబాబు మరో కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే అనాథలకు పెన్షన్లు మంజూరు చేయాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు హాస్టళ్లలో లేకపోతే అనాథాశ్రమాల్లో ఉంటూంటారు. అలా కాని వారిని వారి బంధువులు పోషిస్తూంటారు. ఇది ఆ బంధువులకు కూడా ఇబ్బందే. వారికి కొంత పెన్షన్ రూపంలో ఇస్తే.. వారి పోషణకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన కావొచ్చని అంటున్నారు.
గతంలో చంద్రబాబు ట్రాన్స్ జెండర్లకు కూడా పెన్షన్లు ఇచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా అనాథలకూ పెన్షన్ల అంశాన్ని చంద్రబాబు టేకప్ చేశారు. ఈ విషయంలో విధి విధానాలు ఖరారు చేసి త్వరలో మంజూరు చేయబోయే కొత్త పెన్షన్లతో పాటు వారికి అందించే అవకాశం ఉంది.
చంద్రబాబు నిర్ణయంపై సామాన్యుల్లో.. సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ లేని వారి పట్ల రాష్ట్రాన్ని ఓ కుటుంబంగా చూసుకునే కుటుంబ పెద్ద ఆలోచనలు ఇలాగే ఉంటాయని ప్రశంసిస్తున్నారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో అనాథల లెక్కలు. గుర్తించి అమలు చేయాలన్న సూచనలు చేస్తున్నారు.