సంధ్య ధియేటర్లో దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన.. ఇప్పుడు అల్లు అర్జున్ నెత్తిమీద ఎక్కి కూర్చుంది. పుష్ప 2 ప్రీమియర్లలో భాగంగా సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన రచ్చ.. ఇప్పట్లో మర్చిపోలేం. రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. దీనిపై అల్లు అర్జున్ తో పాటు చిత్రబృందం మొత్తం విచారం వ్యక్యం చేసింది. బన్నీ పాతిక లక్షల నష్టపరిహారం ప్రకటించాడు. అయితే.. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకెళ్లిపోయింది. ఈ ఘటనకు కారణమైన వాళ్లందరినీ ఒకొక్కర్నీ విచారిస్తోంది. సంధ్య ధియేటర్ యాజమాన్యం, ర్యాలీ నిర్వాహకులు.. వీళ్లందరినీ అదుపులోకి తీసుకొంది. ఇప్పుడు అల్లు అర్జున్ని చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. `కేవలం విచారణ కోసం.. బన్నీని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు` అని బన్నీ పీఆర్ టీమ్ చెబుతున్నా సాంకేతికంగా ఇది అరెస్టే. దీన్ని ఎంత కవర్ చేసినా వృధానే. తాజాగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ కాపీని సైతం విడుదల చేశారు. ఆ కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో ముమ్మాటికీ అల్లు అర్జున్ పాత్ర ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఓ సినిమా విడుదలైతే, అభిమానుల్ని కలవడానికో, ప్రమోషన్ కోసమో హీరోలు థియేటర్లకు వెళ్తారు. అది చాలా మామూలైన విషయం కావొచ్చు. కానీ అందరూ వెళ్లడం వేరు, అల్లు అర్జున్ లాంటి స్టార్ వెళ్లడం వేరు. ఏదో గప్ చుప్ గా వెళ్లి సినిమా చూసి, ఫ్యాన్స్ ని కలిసి రావడం ఒక పద్ధతి, పోలీసులకు సమాచారం అందించి, తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లడం మరో పద్ధతి. కానీ అల్లు అర్జున్ ఈ థియేటర్ కు ఓ ర్యాలీలా వెళ్లాడు. దారి పొడవునా, అందరికీ అభివాదం చెబుతూ మరీ వెళ్లాడు. అభిమానులు తండోపతండాలుగా వస్తారని బన్నీ కీ, అతని టీమ్ కీ తెలుసు. బన్నీ వస్తున్నాడంటే ఆ క్రౌడ్ ఎలా ఉంటుందో థియేటర్ యాజమాన్యానికి తెలుసు. కానీ ముందస్తు జాగ్రత్తలు ఏమాత్రం తీసుకోలేదు. తీసుకొన్నా… అవి నామమాత్రంగా మిగిలాయి. ఈ విషయంలో థియేటర్ యాజమాన్యానిది ముమ్మాటికీ తప్పే. ఒకవేళ పోలీసులకు సమాచారం అందించి మరీ బన్నీ థియేటర్ సందర్శనకు వెళ్తే… పోలీసులకు కూడా అందుకు బాధ్యత వహించాలి. బన్నీ వస్తే క్రౌడ్ ని అదుపు చేయడం కష్టం. ఈ విషయం పోలీస్ డిపార్ట్ మెంట్ కు తెలుసు. అలాంటప్పుడు వాళ్లు అనుమతులు ఎలా ఇచ్చారు అనేది ప్రశ్న. అనుమతులు ఇవ్వకుండా, పోలీసులకు చెప్పకుండా ర్యాలీలా వెళ్తే ఈ కేసు బన్నీ మెడకు బలంగా చుట్టుకొన్నట్టే.
తప్పు ఎవరిదైనా ఓ నిండు ప్రాణం బలైపోయింది. అభిమానం పేరిట.. ఓ కుటుంబం వీధిన పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోలు ఇప్పుడు దేవుళ్లతో సమానం. వాళ్లు.. బల ప్రదర్శన కోసమో, లేదంటే… అభిమానుల కోసమో.. ఇలా ప్రజల ముందుకు వచ్చేయడం వల్ల జరిగే మంచి కంటే, నష్టమే ఎక్కువగా ఉంది. అందుకు ఈ ఘటనే అతి పెద్ద నిదర్శనం.