ఉమ్మడి హైకోర్టుని విభజించాలని కోరుతూ తెలంగాణా న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు కూడా హైకోర్టు విభజన జరగాలనే కోరుకొంటున్నారు. విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ఏడాది అక్కడి న్యాయవాదులు కొన్ని రోజులు ఆందోళన చేశారు కూడా. తెలంగాణా ప్రభుత్వం కూడా హైకోర్టు విభజన జరగనిదే సంపూర్ణ రాష్ట్ర విభజన జరిగినట్లు కాదని వాదిస్తోంది. కేంద్రం కూడా సిద్దంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు తను అడ్డుపడటం లేదని చెపుతోంది. అందరూ సమ్మతిస్తున్నా ఎందుకు విభజన జరగడం లేదు? అంటే అందరూ కేంద్రంవైపు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ ల వైపే వేళ్ళు చూపిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాతో భాజపాకి ఉన్న అవసరాలని దృష్టిలో పెట్టుకొనే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దీనికోసం మోడీ ఒత్తిడి చేయడం లేదని కొందరి వాదన. న్యాయవ్యవస్థని అదుపులో పెట్టుకొని తెలంగాణా రాష్ట్రాన్ని పరోక్ష పద్దతిలో నియంత్రించడానికే చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజన జరగకుండా అడ్డుపడుతున్నారని తెరాస నేతల ఆరోపిస్తున్నారు. అవసరమైనప్పుడల్లా తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టి లబ్దిపొందడానికే కెసిఆర్ ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని ప్రతిపక్షాల వాదన. ఆయన తలుచుకొంటే చంద్రబాబు నాయుడుని లేదా ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి హైకోర్టుని ఎప్పుడో విభజించి ఉండేవారని ప్రతిపక్షల వాదన. ఈ సమస్యకి పరిష్కారం తమ చేతిలో లేదని కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ బంతిని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో పడేసి చేతులు దులుపుకొన్నారు. ఈ సమస్యకి అనేక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికి పరిష్కారాలు కూడా స్పష్టంగానే కనిపిస్తూనే ఉన్నాయి కానీ వాటిని ఎవరూ పట్టించుకోకుండా ఎవరికి నచ్చిన పంధాలో వారు సాగిపోతున్నారు.
వారికి ఏపి బార్ కౌన్సిల్ సభ్యులు కూడా ఇప్పుడు జత కలిశారు. వారి ప్రతినిధులు కొందరు నిన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలేని కలిసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన న్యాయవాదులకి, న్యాయమూర్తులకి రక్షణ కల్పించాలని కోరుతూ ఒక వినతి పత్రం అందజేశారు. హైకోర్టు విభజన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు ఆయన చేతిలో లేదనే సంగతి వారికీ తెలుసు. కానీ ఉంగరం ఒక చోట పడిపోతే దానికోసం మరొకచోటు వెతుకుతున్నట్లుగా అందరూ తమకి నచ్చినట్లుగానే ముందుకు సాగిపోతున్నారు.