సినిమా అంటే సెలబ్రేషన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అభిమానుల మధ్య జరిగితే అదో కిక్. ప్రీమియర్ షోల హడావుడిలో ఫ్యాన్స్ చేసే హంగామాని చూసి తరించాల్సిందే. ఇవన్నీ లేకపోతే అది సినిమా ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? అభిమానులతో పాటు స్టార్స్ కూడా కోరుకొనేది ఇదే. కానీ ఇక మీదట ఇలాంటి ఉల్లాసం, ఉత్సాహం.. తెలుగు సినిమాకు దూరం అయిపోతుందేమో అనిపిస్తోంది.
`దేవర` ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తే అక్కడ రచ్చ రచ్చ జరిగింది. ఎంపిక చేసిన వేదిక సామర్థ్యానికి, వచ్చిన అభిమానులకూ పొంతన లేకపోవడంతో రసాభస అయ్యింది. చివరికి ఈవెంట్ కాన్సిల్ చేశారు. ఇప్పుడు `పుష్ప 2` ప్రీమియర్ షో విషయంలో జరిగిన విషాదం చిత్రసీమని మరింత షాక్ కి గురిచేసింది. సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడం, అది అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లేంత వరకూ వెళ్లింది.
నిజంగా అల్లు అర్జున్‌ని రిమాండ్ కి పంపితే, అక్కడ 14 రోజులు ఉండాల్సివస్తే `పుష్ప 2` అనే సినిమా, ఈ సినిమా కోసం వేసిన ప్రీమియర్ షో.. అల్లు అర్జున్‌కే కాదు, తెలుగు సినిమాకే ఓ పీడకలలా ఉండేది. ఇలాంటి విషాదాలు, వివాదాలూ సినిమావాళ్లు తట్టుకోలేరు. పైగా గంభీరంగా కనిపిస్తారు కానీ, పరిస్థితులు ఎదురైనప్పుడు డీలా పడిపోతుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ప్రీమియర్లు, ప్రీ రిలీజ్‌ల గోల లేకపోతే ఇవన్నీ ఉండవు కదా అన్నది వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ! అలా ఆలోచిస్తే ఇక మీదట ప్రీ రిలీజ్లకూ, ప్రీమియర్ షోలకూ తెలుగు సినిమా దూరమైపోవొచ్చు. వాటికి అనుమతులు రావడం కూడా కష్టమే అనుకోవాలి. అభిమానుల్ని కంట్రోల్ చేయడం.. చాలా కష్టమైపోతోంది. ఓ రాజకీయ సభకు ఎంతమంది ప్రజలు వస్తారో అంచనా వేయొచ్చు. కావల్సినంత పోలీసు బందోబస్తుని రెడీ చేయొచ్చు. కానీ సినిమా వేడుకలు అలా ఉండవు. సినిమా ఫంక్షన్లకు వచ్చే అభిమానుల్ని కంట్రోల్ లో పెట్టడమే పోలీసుల పని అనుకొంటే వారానికి రెండు మూడు ఈవెంట్లు జరిగితే.. వాటికే సగం పోలీసు బందోబస్తు ఇవ్వాల్సివస్తుంది. కాబట్టి.. ఈ విషయంలో పోలీసుల వైఖరి తప్పుపట్టలేం. రేవతి లాంటి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినప్పుడు, ముందుగా సమాధానం చెప్పుకోవాల్సింది పోలీసు వ్యవస్థే. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా.. ఇలాంటి ప్రీమియర్లకు పోలీసుల నుంచి అనుమతి నిరాకరించినా వాళ్ల తప్పేం లేదు.
సినిమా వాళ్ల వైఖరులు కూడా మారాల్సిన తరుణం ఇది. సినిమా వేడుకని రాజకీయ సభలా చూడొద్దు. ఎంతమంది ఫ్యాన్స్ వస్తే, ఆ హీరోకి అంత ఇమేజ్ ఉందని అస్సలు అనుకోకూడదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు బలప్రదర్శన వేదికలు కావు. కాకూడదు. అంతిమంగా ఎవరెన్ని చేసినా.. మంచి సినిమా ఇస్తేనే జనం చూస్తారు. లేదంటే లేదు. ఈ ఫాల్స్ ప్రెస్టేజీని మంచి సినిమా తీయడంలో చూపిస్తే బాగుంటుందన్నది అందరి అభిప్రాయం.