అల్లు అర్జున్ ఓ రాత్రి జైల్లో రిమాండ్ ఖైదీగా గడపాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా బెయిల్ పేపర్లు ఆలస్యం కావడంతో ఉదయమే విడుదల చేశారు. దీంతో ఆయన రాత్రంతా జైల్లో ఉన్నారు. జైలు సిబ్బంది ఇచ్చిన ఆహారాన్ని తీసుకోలేదు. నిద్ర కూడా పోలేదని తెలుస్తోంది. ముందు గేటు వైపు మీడియా, అభిమానులు వేచి ఉంటే ఆయనను వెనుక గేటు నుంచి పంపేశారు. అల్లు అర్జున్ తో పాటు ఇదే కేసులో అరెస్టు చేసిన ఇతర నిందితులు, సంధ్యాధియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు.
అల్లు అర్జున్ కేసులో రోజంతా హైడ్రామా నడిచింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో అరెస్టు చేసిన పోలీసులు శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. ఈ కొద్ది సమయంలో ఎన్నో జరిగాయి. కింది కోర్టు రిమాండ్ విధించడం.. వెంటనే హైకోర్టులో గతంలో వేసిన క్వాష్ పిటిషన్ ను లంచ్ మోషన్ గా విచారించిన హైకోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేయడం, ఆయనను జైలుకు తరలించడం.. బెయిల్ పేపర్లు ఆలస్యం కావడం, ఇలా ప్రతి విషయం హైటెన్షన్ గానే సాగింది.
అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న కళాకారుడుకావడమే కాదు పుష్ప 2తో ఉత్తరాదిలోనూ స్టార్ గా మారారు. దీంతో ఆయన అరెస్టు దేశవ్యాప్తగా సంచలనంగా మారింది. చివరికి ఓ రాత్రి జైల్లో గడిపాల్సి వచ్చింది.