చట్టం తన పని తాను చేసుకుపోయిందని అల్లు అర్జున్ కేసులో రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన వద్దే హోంశాఖ ఉంది కాబట్టి ఆయన బాధ్యత తీసుకుని అరెస్టును సమర్థించారు. అయితే మధ్యంతర బెయిల్ వచ్చినా ఓ రోజు ఖచ్చితంగా జైలులో ఉంచడంతో .. చట్టం ఇంత పవర్ ఫుల్ గా పని చేయడానికి ఏదో బలమైన కారణం.. బలమైన వ్యక్తి ప్రోద్భలం ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని అనుకోవచ్చు. అదేమిటన్నది మాత్రం హైలెవల్ సర్కిల్స్‌కు మాత్రమే రూఢీగా తెలుసు. మిగతా జరిగే ప్రచారం అంతా రూమర్సే.
అర్జున్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం అసలు లేదు. అలాంటి ప్రయత్నం చేస్తారని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన తన పై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టుకు వెళ్లారు. గతంలో నంద్యాలలో ఇలాగే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. దాంతో ఈ కేసులోనూ ఆయనకు మెరిట్ ఉంటుందని అనుకున్నారు. సహజంగా న్యాయస్థానాల్లో ఇలాంటి పిటిషన్లు ఉన్నప్పుడు సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల్ని చట్టాలు అరెస్టు చేయడానికి సాహసించవు. కానీ అర్జున్ విషయంలో అది జరగలేదు. అరెస్టు చేశారు.
అయితే అర్జున్ కు ఉన్న హై ప్రోఫైల్ సోర్సులతో ఒకటికి, రెండు కోర్టుల్లో భిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కానీ ఆయనను ఒక్క రోజు అయినా జైలులో ఉంచాలన్న చట్టం పట్టుదల ముందు విఫలమయ్యారు. ఓ రోజంతా జైల్లో ఉన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఇలాంటి అరెస్టులు, న్యాయాలు సెలబ్రిటీలకు, సమాజంలో పలుకుబడి ఉన్న వారికి ప్రత్యేకంగా ఉంటాయి. మొత్తంగా అర్జున్ అరెస్టు.. కేవలం తొక్కిసలాట ఘటన కారణం కాదని.. అంతకు మించి ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.