ఏపిలో తెదేపా ప్రభుత్వంపై ప్రతిపక్ష వైకాపా ఎప్పుడు ఏవిధంగా దాడి చేస్తుందో ఊహించడం కూడా కష్టమే. తమ పార్టీ ఎమ్మెల్యేలని ఫిరాయింపులకి ప్రోత్సహిస్తున్న తెదేపాని కట్టడి చేయడానికి వైకాపా అనుసరిస్తున్న వ్యూహాలని గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. మొదటిసారి తెదేపాని కట్టడి చేయడానికి తెదేపా మంత్రులు, నేతలు రాజధానిలో బినామీ పేర్లతో భూముల కొనుగోలు వ్యవహారాన్ని బయట పెట్టారు. తరువాత డిల్లీ వెళ్లి హడావుడి చేశారు. ఆ తరువాత తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో నిరాహార దీక్ష చేశారు. వైకాపా ఎమ్మెల్యేల వలసలు ఆగిపోవడం గమనిస్తే ఆయన వ్యూహాలు బాగానే ఫలిస్తున్నట్లు అర్ధమవుతోంది. తెదేపా ప్రభుత్వం నిరంతర ఒత్తిడిలో ఉండేవిధంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు అర్ధమవుతోంది.
వాటి తరువాత తాజాగా సదావర్తి సత్రవ భూముల వ్యవహారం వెలికి తీసి దానిపై గట్టిగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. దానిలో అవినీతిని ప్రశ్నిస్తూనే దానితో ప్రజలలో హిందూ సెంటిమెంటుని కూడా తట్టిలేపే విధంగా మాట్లాడుతుండటం మరో సరికొత్త వ్యూహంగానే భావించవలసి ఉంటుంది. తెదేపా ప్రభుత్వం హిందూ దేవాలయాల భూములని కూడా విడిచిపెట్టడం లేదని వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు తదితరులు పదేపదే ఆరోపిస్తున్నారు. “హిందూ ఆలయానికని దాతలు ఇచ్చిన సదావర్తి సత్రవ భూములని స్వంతం చేసుకొని తెదేపా హిందువులకి అన్యాయం చేయాలనుకొంటోందా?” అని ధర్మాన ప్రశ్నించడం అదే సూచిస్తోంది. ఈ వ్యవహారంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తే వైకాపాని ఎవరూ ఎవరూ తప్పుపట్టరు కానీ ఆ సాకుతో హిందువులలో సెంటిమెంటుని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయడమే చాలా తప్పు.
హిందువులనే కాక ముస్లింలు, క్రీష్టియన్లను కూడా రెచ్చగొట్టే విధంగా వైకాపా నేతలు మాట్లాడటం చాలా దారుణమనే చెప్పక తప్పదు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరిట దేవాలయాలని, మసీదులని, చర్చిలని తెదేపా ప్రభుత్వం కూల్చివేస్తోందని వైకాపా అధికార ప్రతినిధి పార్ధ సారధి ఆరోపించారు. హిందూ, ముస్లిం, క్రీస్టియన్ మత పెద్దలు, రాష్ట్ర భాజపా నేతలు దీనిపై తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ మతాల భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్న తెదేపా ప్రభుత్వాన్ని ప్రతిఘటించేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏ మతానికి చెందిన ప్రజలు ఆందోళన చేయకపోయినా అందరూ కలిసి పోరాడాలని పిలుపునివ్వడం అంటే వారిని రెచ్చగొడుతున్నట్లే భావించవలసి ఉంటుంది.
దేశంలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసమో లేకపోతే తమ రాజకీయ ప్రత్యర్దులని దెబ్బ తీయడం కోసమో ఈవిధంగా వ్యవహరిస్తుండటం వలననే దేశంలో మతఘర్షణలు, అశాంతి ఏర్పడుతుంటుంది. వైకాపా స్వయంగా ఒక మతానికి, కులానికి ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ అది లౌకికవాద పార్టీయేనని నమ్మి నేటికీ రాష్ట్ర ప్రజలు దానిని ఆదరిస్తున్నారు. కానీ ఈవిధంగా వ్యవహరిస్తే ప్రజలు కూడా పునరాలోచించుకోవచ్చు. తెదేపాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయాలనుకొంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు కానీ అందుకోసం ఈవిధంగా ప్రజలని రెచ్చగొట్టడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.