వైసీపీ అధినేత జగన్ పరిస్థితి రాను రాను ఘోరంగా మారుతోంది. తన సొంత నియోజకవర్గం పులివెందులలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన వారెవరూ పులివెందులలో విజయం సాధించలేదు. పరిస్థితి బాగోలేదని స్వయంగా అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి రగడ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆయనను అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారు.
సాధారణంగా సాగునీటి సంఘాలు అన్నీ వైసీపీ గుప్పిట్లో ఉంటాయి. పులివెందులలోని ప్రతీ గ్రామంలో జగన్ కు పట్టు ఉంటుంది. అందుకే మెజార్టీ లక్ష వరకూ వస్తుంది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడుపూర్తిగా దిగజారుతోంది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి కలిసి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ పట్టు పెంచుతున్నారు. బీటెక్ రవి నియోజకవర్గంగా తిరుగుతూ గ్రామాల్లో ప్రాబల్యం పెంచుకుంటున్నారు. ఇప్పుడు అధికారం తోడవడంతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ వారితే పై చేయి అయింది.
నిజానికి కొన్ని గ్రామాల్లో టీడీపీ వాళ్ల జాబ్ ఉండేది కాదు. కానీ గత ఆరు నెలలుగా అన్ని గ్రామాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ వర్గం కూడా తయారు అయింది. ఇదే గేమ్ చేంజర్ గా మారుతోంది. జగన్ పులివెందుల వ్యవహారాలను ఎప్పుడూ నేరుగా పట్టించుకోలేదు. ఆయన తరపున అవినాష్ రెడ్డి, ఆయన బంధువులే పెత్తనం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వారి నిర్వాకం వల్లే సాగునీటి సంఘాల్లోనూ పట్టు కోల్పోయారు. ఇప్పుడు స్వయంగా జగన్ జోక్యం చేసుకున్నా ప్రయోజనం ఉండే అవకాశం లేదు.