మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా ఈమధ్యే పట్టాలెక్కాల్సింది. కానీ ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలే ప్రసక్తే లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఎలాగైనా మొదలెట్టాలని బాలకృష్ణ విశ్వ ప్రయత్నాలూ చేశారని, కానీ సాధ్యం కాలేదని తెలుస్తోంది. దాంతో.. ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా పనుల్లో పడిపోయారు. ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబోలో ఓ సినిమా వస్తుందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. మోక్షు సినిమా సైడ్ అయిపోవడంతో, ఇప్పుడు ప్రభాస్ సినిమా పనులు స్పీడప్ అయ్యాయి.
జనవరిలో ప్రభాస్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి కథ అందిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రశాంత్ వర్మ కథే అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ సినిమా కూడా నడుస్తుందని సమాచారం. హోంబలే సంస్థ తో ప్రభాస్ మూడు సినిమాలకు సంతకాలు చేశాడు. ఆ సిరీస్లో.. ప్రశాంత్ వర్మ సినిమా ఒకటి. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగుల్లో బిజీగా ఉన్నాడు. ఈనెలాఖరుతో రాజాసాబ్ పనులు అయిపోతాయి. ఆ తరవాత ఫౌజీపై ఫోకస్ పెడతాడు. ప్రశాంత్ వర్మ సినిమా 2025 చివర్లో ప్రారంభం కావొచ్చు.