బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టింది. ‘అఖండ 2’తో ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి దారులు వేసుకొంటున్నారు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. సెప్టెంబరు 25న దసరా కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ప్రతీ పాత్రనీ చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమా కోసం కాస్టింగ్ విషయంలోనూ ఆచి తూచి అడుగు వేస్తున్నాడు. తాజాగా నటి లయ కుమార్తె శ్లోకాకు ఈ చిత్రబృందంలో చోటిచ్చినట్టు సమాచారం.
‘అఖండ 1’లో పాప పాత్ర చాలా కీలకం. నీకు ఏ ఆపద వచ్చినా, మళ్లీ వస్తా అంటూ బాలయ్య మాట ఇస్తాడు. ఇప్పుడు ఆ పాప పెరిగి పెద్దదయ్యాక వచ్చిన సమస్య ఏమిటి? దాన్ని హీరో ఎలా పరిష్కరించాడు? అనేది పార్ట్ 2 కథ. ఈ పాత్రకు గానూ.. లయ కుమార్తె శ్లోకాని తీసుకొన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. శ్లోక కూడా.. ఈ షెడ్యూల్ లో పాలు పంచుకొంటోందని తెలుస్తోంది. బోయపాటి సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రతీ సినిమాలోనూ ఓ కొత్త విలన్ ని పరిచయం చేస్తారు. ఈసారీ అదే ప్లాన్ వేస్తున్నాడని, విలన్ గా ఓ సర్ప్రైజ్ ఎంట్రీ ఉండబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.