అల్లు అర్జున్ అరెస్ట్, అనంతర పరిణామాలు, రేవంత్ రెడ్డి స్పందనపై ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది అభిప్రాయం మాత్రం అనవసరంగా అర్జున్ ను అరెస్టు చేశారని.. అరెస్టు చేయాల్సినంత కేసు కాదని అంటున్నారు.కానీ అర్జున్ ఇప్పుడు నేషనల్ స్టార్. ఆయన సినిమా ఇప్పుడు పీక్స్ లో ఉంది. అలాంటప్పుడు ఆయన పై ఏ చర్య తీసుకున్నా అది నేషనల్ టాపిక్ అవుతుంది. ఆ మాత్రం రేవంత్ కు తెలియదా?.
రేవంత్ రెడ్డి లక్కీగా పైకి వచ్చిన రాజకీయ నాయకుడు కాదు. చాలా కింద నుంచి ఎదిగారు. అడుగులో ఆయనను మింగేయడానికి రాజకీయ వైకుటంఠపాళిలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అన్నీ తన రాజకీయ చాకచక్యంతోనే ఎదుర్కొంటూ పైదాకా వచ్చారు. ఇంత దాకా వచ్చిన ఆయనకు రాజకీయం నేర్పాల్సిన అవసరం ఏమిటి ?. అర్జున్ అరెస్టు వెనుక రేవంత్ రెడ్డికి తనదైన సమీకరణాలు ఉండవచ్చు.. వాటి వల్ల ఆయన తాత్కలికంగా విమర్శలు ఎదుర్కొన్నా.. ముందు ముందు పెద్ద టార్గెట్ ను గురి పెట్టడానికి ఇవన్నీ రోడ్ మ్యాచ్ లా ఉపయోగపడతాయని అనుకోవచ్చు.
ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని రేవంత్ వాదించినా.. ఓ మాటను మాత్రం గట్టిగా జనంలోకి తీసుకెళ్లారు. ఓ యాక్టర్ ను అరెస్టు చేస్తే ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఓ పేద మహిళ చనిపోయి, ఆమె కుమారుడు ఇంకా కోమాలోకి ఉన్న అంశం గురించి ఒక్కరూ మాట్లాడరేంటి అని ఆయన ప్రశ్నించారు. ఇది ఓ పాలకుడికి ఉండాల్సిన దృక్పథం. రేవంత్ ఈ విషయంలో తన రాజకీయం తాను చేస్తున్నారని ఈ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
గత పాలనలో ఎంతో అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని ఆయినా చర్యలు తీసుకోలేకపోతున్నామన్న అసంతృప్తి రేవంత్ లో ఉంది. తెలంగాణలో చట్టం రాజకీయం కోసం పని చేయదని ముందు నిరూపించి ఆ తర్వాత చర్యలు ప్రారంభించాలనుకున్నారేమో కానీ.. తన బంధువులకు బంధువు అయిన అర్జున్ ను అరెస్టు చేయించారు. ఈ బేస్ గా మిగతా పనులు పూర్తి చేస్తారేమో ?