మనం… ఈతరం గొప్ప చిత్రాల్లో అదొకటి. మూడు తరాల కథానాయికల్ని ఒకచోటకు తీసుకొచ్చిన ముచ్చటైన చిత్రం. నటీనటుల ప్రతిభ, దర్శకుడి ఆలోచన.. ఇవన్నీ మనంని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. తన కెరీర్లో కూడా మనంలాంటి సినిమా ఉండాలని కోరుకొంటున్నాడు రానా. నిజానికి దగ్గుబాటి ఫ్యామిలీతో ఓ సినిమా చేయాలని అప్పట్లో అనుకొన్నారు. రామానాయుడు, వెంకటేష్, రానా, నాగచైతన్య.. ఇలా అందరూ కలసి ఓ సినిమాలో నటించాలనుకొన్నారు. కొన్ని కథలు కూడా సిద్ధమయ్యాయి. రామానాయుడు మరణంతో ఆ కథల్ని పక్కన పెట్టేశారు. అయితే రానాకు మాత్రం మనంలాంటి కథలపై ఆశ చావలేదు.
”వెంకటేష్ బాబాయ్‌తో మల్టీస్టారర్ చేయాలని వుంది. కొన్ని కథలు కూడా విన్నాను. కానీ ఏదీ సంతృప్తినివ్వలేదు. ఆయనతో చేస్తే మనంలాంటి సినిమా చేయాలి. ఎందుంకటే నా మనసుకి బాగా దగ్గరైన సినిమా మనం. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అలాంటి కథలు దొరికితే బాగుణ్ణు” అంటున్నాడు. మరి రానా కోరిక ఎప్పటికి తీరుతుందో?? ప్రస్తుతం బాహుబలి 2తో బిజీగా ఉన్నాడు రానా. బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నాడు. సోలో హీరోగా సెటిల్ అవ్వడానికి కొన్ని కథలు వింటున్నాడు.