ఇలా బిల్లు పెట్టేసి..ఇలా అమలు చేసేసి వెంటనే జమిలీ ఎన్నికలు పెట్టేస్తారని చాలా మంది అధికారంలో లేని పార్టీలు ఆశ పెడుతున్నాయి. కానీ బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బిల్లు ఇంకా పార్లమెంట్ లో పెట్టలేదు కానీ అందులో అంశాలను మీడియా రిపోర్టుచేస్తోంది. తాజాగా బిల్లులో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రకారం జమిలీ ఎన్నికలు 2034లో నిర్వహిస్తారు. అప్పటి వరకూ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా చట్టాల సవరణ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటారు.
మహిళా బిల్లు కూడా గతంలో ప్రభుత్వం ఆమోదించింది. ఆ బిల్లు కూడా అంతే. వెంటనే అమల్లోకి రాదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు. జమిలీ ఎన్నికలకూ అదే ఫార్ములా ఉపయోగిస్తున్నారు. పార్లమెంట్ లో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్తగా 82A సెక్షన్ చేర్చబోతున్నారు. ఇది జమిలీ ఎన్నికలను నిర్దేశిస్తుంది. అలాగే 83 సెక్షన్ ప్రభుత్వాల కాలపరిమితికి సంబంధించి మారుస్తారు. ఆర్టికల్ 172, ఆర్టికల్ 327లో కూడా మార్పులు చేస్తారు. ఈ రెండు ఎమ్మెల్యేల పదవికాలం, ప్రజాప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన అంశాలవి. వీటిలోనూ సవరణలు చేయనున్నారు.
జమిలీ ఎన్నికలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని ఒక్క సారిగా అన్ని ప్రభుత్వాలను రద్దు చేసేసి మళ్లీ ఎన్నికలు పెట్టడం ద్వారా సాధ్యం కాదు. మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి.. ఆ సమయానికి అంతా పకడ్బందీగా అయ్యేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటారు. మొత్తం కేంద్రం హడావుడి పడటం లేదని దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చేస్తోందని అనుకోవచ్చు.