ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వింటే ఎవరికైనా సలహాలను పాఠాల రూపంలో ఇచ్చేస్తారు. అవతలి వారు ఆయనపై గౌరవంతోనో మీడియా అన్న కారణంగా ఇచ్చే కారణంగా ఇచ్చే అటెన్షన్ తోనో వాటిలో ఒకటో రెండో పాటిస్తే ఇక హడావుడికి అంతే ఉండదు. ఒక రోజు ముందు సోది చెబుతానమ్మా.. సోది అంటూ తన పత్రికలో ఓ స్టోరీ రాయించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు సోది చెప్పారని సమయం అంతా తినేశారని ఆయన ఉద్దేశం. వీకెండ్ కామెంట్ లో ఈ స్టోరీని మరింత విస్తరించి చంద్రబాబు కలెక్టర్లతో సమావేశాలు అవసరమా అన్నట్లుగా రాసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఇంత సుదీర్ఘ సమావేశాలు ఉండవని అంతకు ముందు రోజే ప్రకటించారు. ఇది కలసి వచ్చింది.
ఇక్కడ కలెక్టర్ల సమావేశాలు అవసరమా లేదా అన్నది వారు తేల్చుకుంటారు. పబ్లిక్ ను తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. కానీ ఇలాంటి సమావేశాలు .. అధికార యంత్రాంగం మధ్య ఓ మంచి వాతావరణం తెచ్చి పెడతాయి. రెండు రోజుల పాటు కలెక్టర్లు , మంత్రులు అంతా కలిసి ఉండటం వల్ల సమన్వయం కూడా పెరుగుతుంది. ఓ రకంగా ఓరియంటేషన్ తరహాలో ఉంటుంది. ఈ విషయం ఆర్కేకు నచ్చలేదు. అంతే కాదు విజన్ డాక్యుమెంట్ ప్రకటన కూడా ఆయనకు నచ్చలేదు. చంద్రబాబు ఒకప్పుడు 2020 అన్నారు కానీ ఎవరూ పట్టించుకోలేదని …కానీ రాజకీయంగా నష్టానికి గురయ్యారని ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని అంటున్నారు.
నిజమే కావొచ్చు కానీ ఓ టార్గెట్ పెట్టుకోని పాలకుడి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది?. 2047 వరకూ చంద్రబాబు సీఎంగా ఉండరు. ఆ విషయం ఆయనకూ తెలుసు. అందులో ప్రకటించినదంతా తాను చేస్తానని ఆయన చెప్పడం లేదు. రాష్ట్రానికి ఓ దిక్సూచీలా ఉంటుందని చెబుతున్నారు. అలా ప్రకటించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏమీ రాదు. తాను సీఈవోగా మారుతున్నారని ఆర్కే అంటున్నారు. నిజానికి ఇలాంటి ప్రచారాలు చేయడం వల్లనే.. ప్రజల్లో చర్చ జరుగుతుంది. జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఎవరో రాసిచ్చింది చదవడం తప్ప పరిపాలనే చేతకాదు. చంద్రబాబు యాక్టివ్ గా చేస్తే.. ఇలా అవసరమా అంటారు. అదే రాజకీయం అనుకోవాలేమో?
ఈ వారం ఆర్టికల్ లో చంద్రబాబుకు సలహాలు మీద సలహాలు ఇచ్చారు ఆర్కే. 2014-19 మధ్య ప్రజల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని వాదించారు. నిజానికి ఇతర ఫీడ్ బ్యాక్లు పక్కన పెడితే పొలిటికల్ ఫీడ్ బ్యాకుల్ని పంపి.. టీడీపీని భ్రష్టుపట్టించింది ఆర్కే అని చాలా మంది టీడీపీ నేతల గట్టినమ్మకం. ఈ విషయం సామాన్యులకు తెలియదు కదా అని వేరే కోణంలో రాసుకొచ్చేశారు.