మచిలీపట్నంలో ఓ హత్య జరిగింది. నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ దృశ్యాలు మీడియాలో వచ్చాయి. ఆ నిందితులు తాము హత్య జరిగిన తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పీఏకు ఫోన్ చేశారని పోలీసులు గుర్తించి కేసులు పెట్టారు. నిజానికి పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు కొల్లు రవీంద్రకు ఎలా ఫోన్ చేస్తారు. వారి ఫోన్లు తీసుకుని పోలీసులే ఫోన్లు చేశారు. ఆ ఫోన్ కాల్ సాక్ష్యంగా ఆయనపై కేసు పెట్టారు. ఆయనను అరెస్టు చేసి పారిపోతూంటే పట్టుకున్నామని ప్రచారం చేశారు. కొల్లు రవీంద్ర పదేళ్లు మంత్రిగా ఉన్నా ఒక్క వైసీపీ నేతపై కూడా కక్ష సాధింపులకు పాల్పడలేదు. అయినా ఆయనను టార్గెట్ చేశారు. హత్య కేసులో కుట్ర చేసి మరీ ఇరికించారు.
ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కొల్లు రవీంద్ర మళ్లీ మంత్రి అయ్యారు. కానీ పేర్ని నాని అరెస్టు కాలేదు. అడ్డంగా దొరికిన కేసులోనూ ఆయన నిర్భయంగా పరారయ్యారు. హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు. కానీ ఆయనను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. తనను అరెస్టు చేయవద్దని ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అసలు అరెస్టు ముప్పు ఆయనకు కాదు ఆయన భార్యకు ఉంది. ఆమె పేరుపై ఉన్న గోడౌన్లలోనే బియ్యం మాయమయ్యాయి.
కొల్లు రవీంద్ర చాన్స్ దొరికినా పేర్ని నానిని అరెస్టు చేయాలని ఒత్తిడి చేయడం లేదు. పోలీసులు తమ పద్దతి ప్రకారం తాము చేసుకోనిస్తున్నారు. కానీ పేర్ని నాని మాత్రం.. కొల్లు రవీంద్రను తప్పుడు కేసుల్లో అరెస్టు చేయించారు. తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పుడుపేర్ని నాని బియ్యం డబ్బులు కడతామంటూ రూ. కోటి చెక్కును పౌరసరఫరాల శాఖకు పంపించారు. పోనీలే అని వదిలేస్తారో.. ఖచ్చితంగా గత పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే అని తేలుస్తారో చూడాల్సింది.