తమిళ సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తనదైన రోజున తెలుగులో స్ట్రయిట్ సినిమాలకు మించిన వసూళ్లు సాధించగలడు. తెలుగులో సూర్యకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సరైన సినిమా పడాలంతే. తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని సూర్య చాలా కాలంగా అనుకొంటున్నాడు. కొంతమంది దర్శకులు కూడా సూర్యతో సినిమా చేయడానికి ప్రయత్నించారు. సూర్యతో సినిమా చేయాలనుకొన్నానని రాజమౌళి ఓ సందర్భంలో గుర్తు చేసుకొన్నారు. త్రివిక్రమ్ – సూర్య కాంబోలో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. అంతెందుకు.. బోయపాటి శ్రీను కూడా సూర్యతో ఓ సినిమా చేద్దామనుకొన్నారు. కానీ ఇవేం కుదర్లేదు. సూర్య తెలుగు సినిమా ఓ కలలానే ఉండిపోయింది.
అయితే ఇన్నాళ్లకు యువ దర్శకుడు వెంకీ అట్లూరి సూర్యతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నాడు. సూర్య – వెంకీ అట్లూరి కాంబోలో త్వరలోనే ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే సూర్యకు కథ చెప్పారని, సూర్య ఈ సినిమా చేయడానికి అంగీకారం తెలిపారని టాక్.
సార్, లక్కీ భాస్కర్… ఈ రెండు సినిమాల్నీ తెలుగేతర హీరోలతోనే చేశాడు వెంకీ. ఈసారి కూడా తమిళ హీరోతో కమిట్ అయ్యాడు. చూస్తుంటే వెంకీ అట్లూరికి మన హీరోలపై కంటే, వాళ్లపైనే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.