జమిలీ ఎన్నికల బిల్లును సోమవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న కేంద్రం హఠాత్తుగా వెనుకడుగు వేసినట్లుగా కనిపిస్తోంది. లోక్ సభ బిజినెస్ లిస్టులో ఈ రోజు ఉదయం వరకూ ఉన్న జమిలీ బిల్లును హఠాత్తుగా తొలగించారు. సోమవారం జమిలీ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టే విషయంలో పునరాలోచన చేయడంతో బిజినెస్ లిస్టులో నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా సభా కార్యకలాపాలు ఎలా సాగాలో ముందుగానే నిర్ణయమవుతాయి. బిల్లులు ప్రవేశపెట్టాలంటే బిజినెస్ లిస్టులో ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ తమ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. ఇక బిల్లు పెట్టి ఆమోదించడమో.. జేపీకి పంపించడమో చేస్తారని అనుకున్నారు. కానీ హటాత్తుగా వెనక్కి తగ్గారు. సోమవారం బిల్లు పెట్టే విషయంలో పునరాలోచన చేశారు. దీనికి కారణం ఏమిటో స్పష్టత లేదు.
అయితే కేంద్రం ఎంతో కసరత్తు చేసిన తర్వాతనే బిల్లును పార్లమెంట్ వరకూ తీసుకు వచ్చారు. ఇలాంటి సమయంలో వెనక్కితగ్గే అవకాశాలు ఉండవు. ఎక్కడైనా చిన్న లూప్ హోల్ ను న్యాయనిపుణులు కనిపెట్టారేమోని వాటిని కరెక్ట్ చేయడానికి సమయం తీసుకునేందుకు బిల్లు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికి అయితే బిజినెస్ లిస్టులోనుంచి తొలగించారు. ఆ బిల్లు స్టేటస్ పై అధికారిక ప్రకటన చేయలేదు.