అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చాక ఒక్క క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. శనివారం అంతా.. బన్నీ ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు క్యూ కడుతూనే ఉన్నారు. ఒకరి తరవాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఆదివారం బన్నీ చిరంజీవి, నాగబాబు నివాసాలకు వెళ్లి కలిసి వచ్చాడు. నిజానికి.. శనివారమే చిరంజీవి బన్నీ ఇంటికి వెళ్లాల్సింది. కానీ `నేనే వస్తా మావయ్యా` అని బన్నీ చిరుతో చెప్పినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగబాబు విషయంలోనూ ఇదే జరిగింది. అందుకే శనివారం చిరంజీవి, నాగబాబు ఇద్దరూ బన్నీని కలవడానికి వెళ్లలేదు.
ఇప్పుడు పవన్ ని కలిస్తే… మెగా రౌండ్ పూర్తవుతుంది. పవన్ ఎక్కడ ఉంటే, అక్కడకు వెళ్లి, వ్యక్తిగతంగా కలిసిరావాలని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆదివారం పవన్ హైదరాబాద్ కు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో ఆయన షెడ్యూల్ మారింది. లేకపోతే ఆదివారమే పవన్ ని కూడా బన్నీ కలిసేవాడు
మెగాఫ్యాన్స్ తో, మెగా హీరోలతో బన్నీకి కాస్త గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఇప్పుడు, ఇలా, ఈ సందర్భంలో తగ్గే అవకాశం వచ్చింది. చిరు, నాగబాబులను వాళ్ల ఇంటికి వెళ్లి కలవాలనుకోవడం బన్నీ తీసుకొన్న మంచి నిర్ణయం. ఇలాగైనా తామంతా ఒక్కటే అనే సంకేతాల్ని బన్నీ పంపగలిగాడు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ మనసుల్ని గెలుచుకొన్నాడు బన్నీ. తమ మధ్య ఎన్ని అభిప్రాయ బేధాలున్నా, అవసరం అయినప్పుడు తామంతా ఒక్కటే అని మెగా హీరోలు ఎప్పటి నుంచో నిరూపించుకొంటూనే ఉన్నారు. ఇప్పుడూ అదే జరిగింది. మెగా హీరోల మధ్య చిన్న చిన్న పొరపొచ్ఛాలు వచ్చినా ఆనందపడే ఓ వర్గానికి ఈ దృశ్యాలు కడుపు మంటగానే ఉంటాయి. బన్నీకీ మెగా హీరోలకూ మధ్య ఉన్న కాస్త గ్యాప్ ని క్యాష్ చేసుకొందామనుకొన్న వైకాపా వర్గాలు ఇప్పుడు ఈ కలయిక చూసి కుళ్లుకోవడం ఖాయం. ఇదే.. అనుబంధం బన్నీ మున్ముందు కూడా కొనసాగించాలి. మెగా హీరోలంతా ఒక్కటే అనే సంకేతాల్ని పంపాలి. అప్పుడు ఎవరూ మెగా కంపౌండ్ ని బద్దలు కొట్టే సాహసం చేయరు.