చంద్రబాబు విజన్ పైనా జగన్ రెడ్డి విమర్శలు చేశారు. షర్మిల విమర్శించారు కాబట్టి ప్రతిపక్ష నేతగా తనను తాను చెప్పుకునే జగన్ విమర్శింకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ .. కొత్త స్క్రిప్ట్ రైటర్ ఎప్పట్లాగే చాటభారతంలా ఎనిమిది పాయింట్లు రాసి ఇస్తే జగన్ పేరు మీద పోస్టు చేశారు. ఈ పోస్టును నిజంగా జగన్ కూడా చదివి ఉంటారని వైసీపీ నేతలూ అనుకోరు. ఎందుకంటే ఆయనకు అంత ఓపిక ఉండదు. అయన పేరుతో సజ్జల చేసే రాజకీయాలే నడుస్తూ ఉంటాయి.
అమరావతిని తీసేసి మూడురాజధానులు పెడతానన్నప్పుడు రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటూ జగన్ రెడ్డి ఓ నివేదికను సమర్పించారు. అదికూడా చంద్రబాబు హయాంలో ప్రకటించిన నివేదిను అటూ ఇటూ మార్చి ప్రకటించారు. దానికి మళ్లీ ఓ కన్సల్టెన్సీకి కోట్లుకట్టబెట్టారు. ఇలాంటి పనులు చేసే వారికి సొంతంగా ప్రణాళికలు సిద్దం చేయడంలో ఎలాంటి అనుభవం ఉంటుంది? ముందు చూపు ఉంటుంది?. చంద్రబాబు 2020 అన్నప్పుడు ఉమ్మడిరాష్ట్రం ఎలా ఉంది.. ఆయన వేసిన పునాదుల నుంచి చూస్తే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయో చూస్తే జగన్కు ఆ ఫలాలు ఎలా ఉంటాయో అర్థమవుతుది. జగన్ రెడ్డి దోచుకున్న వేల ఎకరాలకు విలువ చంద్రబాబు వేసిన ప్రణాళికల వల్లనే వచ్చింది.
అప్పు చేద్దాం..లేకపోతే అమ్మేద్దాం.. లేకపోతే మందుబాబుల్ని పిండేద్దాం అనుకునే మనస్థత్వం ఉన్న పాలకుడు.. దీర్ఘకాలిక ప్రణాళికల గురించి వ్యతిరేకంగా మాట్లాడటంతో వింతేమీ లేదు. కానీ ప్రజల్లో ఉన్నప్పుడు కాస్తంతయినా విజ్ఞతగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. కానీ జగన్ రెడ్డికి అదేమీ లేదు. తమ ఓటర్లు వేరని వంచన చేసుకుని ఇలా మాట్లాడేస్తూ ఉంటారు.