గత పదిహేను రోజులుగా ‘పుష్ప 2’ మానియానే అంతా. ‘పుష్ప 2’ విడుదలకు వారం ముందు, వారం తరవాత.. సినిమాల్ని విడుదల చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. ‘పుష్ప 2’ హంగామా కొద్ది కొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో మళ్లీ సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. ఈవారం 3 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఓ తెలుగు సినిమా ఉంటే, రెండు డబ్బింగ్ బొమ్మలు ఉండడం విశేషం.
అల్లరి నరేష్ నటించిన ‘బచ్చలమల్లి’ ఈవారమే వస్తోంది. సుబ్బు దర్శకత్వంలో, రాజేష్ దండా నిర్మించిన సినిమా ఇది. ‘నాంది’ నుంచి నరేష్ ప్రయాణం కొత్త పంథాలోనే సాగుతోంది. కొత్త తరహా పాత్రల్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు నరేష్. ఈ సినిమా కూడా అదే కోవకు చెందుతుంది. టీజర్, ట్రైలర్లలో నరేష్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఎమోషన్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇదని అర్థం అవుతోంది. పాటలూ బాగానే వినిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ లో గుండెల్ని పిండేసే ఎమోషన్ ఉందని, అది వర్కవుట్ అయితే, సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.
ఈవారమే ఉపేంద్ర ‘UI’, విజయ్ సేతుపతి ‘విడుదల 2’ వస్తున్నాయి. ఉపేంద్ర సినిమాలన్నీ క్రేజీ క్రేజీగా ఉంటాయి. ఈసారి కూడా ఆయనేదో అవుటాఫ్ ది బాక్స్ ఐడియానే తీసుకొస్తున్నట్టు అనిపిస్తోంది. ట్రైలర్ లో ఆయన గెటప్, సినిమా సెటప్ అన్నీ వింత వింతగా ఉన్నాయి. దానికి తోడు ప్రచారం కూడా బాగానే చేసుకొంటున్నారు.
వెట్రిమారన్ అభిమానులు ఈసారి మరింత కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే ‘విడుదల 2’పై వాళ్లకు బాగా నమ్మకం. ‘విడుదల 1’ మంచి విజయాన్ని అందుకొంది. ఈసారి ఈసీక్వెల్ లోనూ వెట్రిమారన్ తన ప్రభావం చూపిస్తాడని ఆశ పడుతున్నారు. విజయ్‌సేతుపతి హీరోగా నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ‘మహారాజా’ తరవాత విజయ్ కి తెలుగునాట మరింత గుర్తింపు వచ్చింది. అది ఈ సినిమాకు ఉపయోపగడొచ్చు.
ఈవారం సినిమాలకు ఓ అదనపు ఎడ్వాంటేజ్ ఉంది. కాస్త నిలబడినా లాంగ్ రన్ ఉంటుంది. క్రిస్మస్ కు సైతం బాక్సాఫీసు ముందుకు పెద్దగా సినిమాలు రావడం లేదు. ఈ సెలవల్ని క్యాష్ చేసుకొనే అవకాశం ఉంది.