ఈ సంక్రాంతికి వస్తున్న ప్రాజెక్టుల్లో ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. జనవరి 10న విడుదల అవుతోంది. 2025 సీజన్‌ని మొదలు పెట్టేది ఈ చిత్రంతోనే. శంకర్ దర్శకత్వం వహించిన సినిమా, ఆర్.ఆర్.ఆర్ తరవాత రామ్ చరణ్ చేసిన సినిమా, పైగా దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా, అన్నింటికంటే ముఖ్యంగా సంక్రాంతి సినిమా… అయినా సరే – ఫ్యాన్స్‌లో ఎక్కడో ఓ చోట టెన్షన్ ఉంది. ఎందుకంటే శంకర్ ఫామ్ లో లేడు. ‘భారతీయుడు 2’ తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషన్ కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ట్రైలర్ వచ్చాక తప్ప, ఈ సినిమాపై పూర్తి స్థాయి అవగాహన రాదు. `గేమ్ ఛేంజర్` చిత్రానికి కాస్త ఊపు, ఉత్సాహం రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్`పై చేసిన కొన్ని కామెంట్లు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
‘బిగ్ బాస్ 8’ ఫినాలే కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకొన్నాడు నాగార్జున. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇది వరకటి శంకర్ ని ఈసారి తెరపై చూస్తామని, శంకర్ స్థాయిలోనే స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు చరణ్. ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎలాంటి సినిమా చేయాలా? అని ఆలోచించుకొంటున్న తరుణంలో తన అదృష్టం కొద్దీ శంకర్ ప్రాజెక్ట్ పడిందని, శంకర్ తో సినిమా అనగానే కష్టపడాల్సివచ్చినా, ఆ తరవాత చాలా సౌలభ్యాలుంటాయని పేర్కొన్నాడు చరణ్. ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదే ఊపులో గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలుపెట్టేస్తే మంచిది. పైగా.. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. ఈలోగా.. దేశమంతా ప్రమోషన్లు చేయాలి. పాటలు, ట్రైలర్ విడుదల చేయాలి. గేమ్ ఛేంజర్ కు సంబంధించి హైదరాబాద్‌లో ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. దీనిపైనే ప్రస్తుతం దిల్ రాజు అండ్ కో దృష్టి సారించింది.