ఎమోషనల్, హెవీ క్లైమాక్స్‌ల వల్ల సినిమా జాతకాలే మారిపోతాయి. క్లైమాక్స్ తో సినిమా రూపు రేఖలే మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘గీతాంజలి’, ‘బృందావన కాలనీ’ లాంటి చిత్రాలు క్లైమాక్స్ వల్ల మరింతగా నిలబడిపోయాయి. ఇటీవల విడుదలైన `క` మరో మంచి ఉదాహరణ. ఈ సినిమా క్లైమాక్స్ కథ రూపు రేఖల్నే మార్చేసింది. ‘బచ్చలమల్లి’లో కూడా అలాంటి క్లైమాక్స్ చూడొచ్చన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. సుబ్బు దర్శకత్వం వహించారు. రాజేష్ దండా నిర్మాత. ఈనెల 20న విడుదల అవుతోంది. ఓరకంగా ఇదో బయోపిక్. మూర్ఖత్వం హద్దులు దాటిన ఓ వ్యక్తి కథ. దానికి కాస్త సినిమాటిక్ టచ్ ఇచ్చి తెరపైకి తీసుకొచ్చారు. క్లైమాక్స్ బాగా హెవీగా ఉంటుందని, షాక్‌కి గురి చేస్తుందని, ప్రేక్షకుల హృదయాలు చెమ్మగిల్లుతాయని, కొంతకాలం ఈ క్లైమాక్స్ గురించి మాట్లాడుకొంటారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నరేష్ కూడా అదే మాట అంటున్నాడు. ”క్లైమాక్స్ గుర్తుండిపోతుంది. బయటకు వచ్చాక మాట్లాడుకొంటారు. కొన్ని రోజుల పాటు ఆ ఎమోషన్ వెంటాడుతుంది” అంటూ హైప్ ఎక్కిస్తున్నారు.
ఇప్పటికే కొంతమందికి ఈ సినిమా చూపించారని తెలుస్తోంది. వాళ్లంతా ముక్త కంఠంతో ”ఈ సినిమాకు అవార్డులు, రివార్డులూ వస్తాయి” అని జోస్యం చెబుతున్నార్ట. ‘నేషనల్ అవార్డుకు ట్రై చేయండి’ అంటూ నిర్మాతకు సలహాలు ఇస్తున్నార్ట. అంత హెవీ ఎమోషన్ ఈ సినిమాలో ఏముందా? అనే ఆసక్తి మొదలైంది. 19న ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.
అల్లరి నరేష్‌తో తెలుగు 360 చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.