అగ్ర హీరోల నుంచి వచ్చే సినిమాల సందడే వేరు. బాక్సాఫీసుకి నూతనోత్తేజాన్ని తీసుకొచ్చేది అగ్ర హీరోల సినిమాలే. 2024లో టాప్ హీరోల సినిమాల సందడిలోకి వెళితే..
2024 సంక్రాంతి అగ్ర హీరోలకి అంతగా కలసిరాలేదు. ఎన్నో అంచనాలతో మహేష్ బాబు గుంటూరుకారం పండగ బరిలో దిగింది. మహేష్, త్రివిక్రమ్ కాంబో అనగానే అందరిలో ఓ ఆసక్తి. టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి. కుర్చీ మడత సాంగ్ వైరల్ అయ్యింది. మహేష్ మాస్ అవతార్ క్యురియాసిటీ పెంచేసింది. తీరా సినిమా మాత్రం నిరాశ పరిచింది. ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. మహేష్ అభిమానులు సైతం పెదవి విరిచారు. ఏదో ఊహించి వెళితే ఇంకేదో జరిగిందనే కామెంట్లు వినిపించాయి. ఫ్యామిలీ సినిమాకి మాస్ టైటిల్, మాస్ ప్రమోషన్స్ చేయడంలో పొరపాటు జరిగుంటుదని స్వయంగా నిర్మాత నాగవంశీ సినిమా ఫలితాన్ని సమీక్షించున్నారు. ఏదేమైనప్పటికీ మహేష్, త్రివిక్రమ్ నుంచి ఆడియన్స్ కొరుకునే సినిమా కాలేకపోయింది గుంటూరుకారం.
ఇదే సంక్రాంతికి వెంకటేష్ సైంధవ్ సినిమాతో వచ్చారు. నిజానికి వెంకటేష్ కి సంక్రాంతి మంచి సెంటిమెంట్ సీజన్. అయితే ఈ సంక్రాంతి ఆయనకు కలిసి రాలేదు. సైంధవ్ మంచి స్టైలిష్ యాక్షన్, ఒక యూనిక్ పాయింట్ ఉన్న సినిమా. వెంకటేష్ చాలా కొత్తగా కనిపించారు. కానీ సినిమా నిలబడలేకపోయింది. సంక్రాంతి మూడ్ కి ఈ సినిమా మ్యాచ్ కాలేదు. మామూలు సీజన్లో వచ్చుంటే ఈ సినిమాకి బెటర్ రిజల్ట్ ఉండేదేమో కానీ సంక్రాంతికి ఈ సినిమా ఏమాత్రం వర్కౌట్ కాలేదు.
నాగార్జున ‘నా సామిరంగ’తో వచ్చారు. ఇది కంప్లీట్ గా సంక్రాంతి సినిమా. కథ కూడా సంక్రాంతి కనుమ భోగి చుట్టూ తిరుగుతుంది. పాటల్లో, బ్యాక్ డ్రాప్ లో పండగ కళ కనిపించింది. ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు కానీ ఈమధ్య కాలంలో నాగార్జునకి ఒక మంచి రిలీఫ్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. కేవం 70 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతి టార్గెట్ చేసుకొని సినిమాని రిలీజ్ చేయడం మరో విశేషం. గొప్ప లాభాలు రాలేదు కానీ, ఎలాంటి నష్టాలు లేకుండా బయటపడింది.
రవితేజకి 2024 ఏ మాత్రం కలిసిరాలేదు. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు దెబ్బతిన్నాయి. ఈగల్ సంక్రాంతి రావాల్సింది. థియేటర్స్ రద్దీ వలన ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. సోలో డేట్ దొరికినప్పటికీ సినిమా బాక్సాఫీసు ముందు నిలబడలేకపోయింది. బాలీవుడ్ రైడ్ సినిమాని రవితేజతో మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేశాడు హరీష్ శంకర్. పాటలు, ప్రోమోలు ఆసక్తిని పెంచాయి. తీరా సినిమా మాత్రం గతి తప్పింది. ఈ రెండు సినిమాల్ని నిర్మించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నష్టాలని చూసింది.
‘కల్కి’తో తో ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొట్టారు. చాలా అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సౌత్ ఇండియా హీరోలలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రెండుసార్లు రాబట్టిన తొలి హీరోగా ప్రభాస్ కల్కితో రికార్డ్ క్రియేట్ చేశారు. ‘బాహుబలి2’ 10 రోజుల్లో రూ.1000 కోట్లు వసూలు చేస్తే, ‘కల్కి’కి 15 రోజుల్లో ఆ రికార్డ్ ని అందుకుంది. అలాగే నార్త్ అమెరికాలో 17 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగానూ (నాన్-బాహుబలి) రికార్డును బద్దలు కొట్టింది.
‘దేవర’తో సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. విడుదలకు ముందే అనేక రికార్డులుని బద్దలు కొట్టింది దేవర. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారా 1 మిలియన్ డాలర్లకు చేరిన ఫస్ట్ ఇండియా మూవీగానూ అరుదైన రికార్డు సృష్టించింది. విడుదల తర్వాత ఈ రికార్డ్ లు కొనసాగాయి. వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లుపై గ్రాస్ సాధించింది. దేవర 52 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషం.
బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ లకు 2024 గ్యాప్ వచ్చింది. చరణ్ గేమ్ చెంజర్ ఈ పాటికి వచ్చేయల్సింది, కానీ కొని కారణల వల్ల సంక్రాంతికి వెళ్ళింది.
పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రాలేదు కానీ 2024 ఆయనకి మైల్ స్టోన్ ఇయర్. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సగర్వంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పవన్. ఆయనకి, ఆయన అభిమానులకు ఇది మెమరబుల్ ఇయర్.
పుష్ప 2 తో 2024కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చారు అల్లు అర్జున్. పాన్ ఇండియా మాస్ విజయాన్ని అందుకుంది పుష్ప2. కేవలం ఆరు రోజుల్లో వెయ్యికోట్లు కలెక్ట్ చేసిన పుష్ప2 .. ఇండియా సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డ్ ని సృష్టించింది. పుష్ప స్వాగ్ మ్యానరిజంకు మరోసారి ఫిదా అయ్యారు ఆడియన్స్. ప్రస్తుతం సినిమా బాక్సాఫీసు వద్ద నిలకడగా ఆడుతోంది. 2024 ఎలా సాగినప్పటికీ చివర్లో తెలుగు సినిమాకి కావాల్సిన హై ఇచ్చాడు అల్లు అర్జున్.