కేటీఆర్ ను అరెస్టు చేయడం రాజకీయ కక్షసాధింపు కాదు.. ఖచ్చితమైన ఆధారాలు ఉండబట్టే అరెస్టు చేశామని జనం అంతా అనుకునేలా చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మొదట కేటీఆర్‌కు నోటీసులు జారీ చేస్తారని అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్‌లో తేలిపోయిన రూ 55 కోట్ల విషయంలో అటు కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి ఆమోదం వచ్చింది. దాన్ని సీఎఫ్ ద్వారా ఏసీబీకి పంపించారు. ఇదే సమయంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు సీఎఫ్ ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించే సంస్థకు ప్రభుత్వం తరపునరూ. 55 కోట్లు చెల్లించారు. నిజానికి ఇలాంటి ఈవెంట్లు నిర్వహించాలంటే ప్రభుత్వానికి ఆదాయం ఉండేలా చూసుకుంటారు. తొలి విడత నిర్వహించినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాలేదు కానీ భారం పడలేదు. కానీ రెండో ఈవెంట్ కు వ్యూహాత్మకంగా స్పాన్సర్లు అంతా వైదొలిగారు. ఆ భారం అంతా తామే తీసుకుంటామని ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే అధికారికంగా చేస్తే సమస్య వచ్చేది కాదు. కానీ ముందు డబ్బులు తరలించేశారు. దానికి ఓ లెక్కా పత్రం లేదు.
తాము ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించే చెల్లింపులు చేశామని వాదించినా.. దానికి ఫ్రూఫ్ ఏమిటి అని ఏసీబీ అడిగే ప్రశ్నలకు అర్వింద్ కుమార్, కేటీఆర్ వద్ద సమాధానాలు ఉండవు. వారికి చెల్లింపులు చేయడానికి ప్రాథమికంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం కేబినెట్ అనుమతి కూడా లేదు. ఆ సంస్థ విదేశీ ఖాతాకు నిధులు వెళ్లిపోయాయి. అంటే ఎన్ని చెప్పినా అక్రమంగా ఫార్ములా ఈ కార్ రేసు సంస్థకు నిధులు తరలి వెళ్లిపోయాయి. దీన్ని సమర్థించుకోవడం అంత తేలిక కాదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏసీబీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని.. వాటితో ప్రజలు కూడా కేటీఆర్ ను అరెస్టు చేయడం తప్పు కాదని భావిస్తారని అంటున్నారు. అలాంటి సిట్యూయేషన్ వచ్చిన తర్వాత అరెస్టు ప్రక్రియ పూర్తి చేస్తారని చెబుతున్నారు.