అనుష్క, సమంత, తమన్నా, శ్రుతి హాసన్, కాజల్, కీర్తి సురేష్ ..వీళ్ళంతా ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ తారలు. బలమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నటీమణులు. 2023లో కొత్తందాలకు సవాల్ విసిరి మంచి విజయాల్ని అందుకున్నారు. అయితే 2024 మాత్రం వీరి హవా తగ్గింది.అనుష్క, సమంత, శ్రుతి హాసన్ నుంచి సినిమాలు రాలేదు. కీర్తి సురేష్ బేబీజాన్ తో హిందీ నాట అడుగుపెట్టింది. ఈ సినిమా ఇంకా రావాల్సివుంది. తమన్నా బాలీవుడ్ పై ద్రుష్టి పెట్టింది. కాజల్ చేసిన సత్యభామ నిరాశ పరిచింది. భారతీయుడు 2 చివర్లో ఓ గ్లింప్స్ లా కనిపించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్. అయితే ఈ ఏడాది సీనియర్లని బీట్ చేస్తూ నవ సోయగాలు సత్తా చాటారు.
గుంటూరు కారంలో మహేష్ బాబు పక్కన మెరిసింది శ్రీలీల. ఆమె కెరీర్ బిగ్గెస్ట్ సినిమా ఇదే. సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. మహేష్, శ్రీలీల జోడి అంతగా కుదరలేదనే కామెంట్లు కూడా వినిపించాయి. పుష్ప 2 లో చేసిన కిసిక్ సాంగ్ మాత్రం ఆమెకు డ్యాన్సింగ్ క్వీన్ ట్యాగ్ ని తీసుకొచ్చింది. నితిన్ తో చేసిన రాబిన్ వుడ్ క్రిస్మస్ కి రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడింది.
అషికా రంగనాథన్ నాసామిరంగా తో అందరిదృష్టిని ఆకర్షించింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో అవకాశం అందుకుంది. ఇదే సంక్రాంతికి హనుమాన్ లో కనిపించిన అమృత అయ్యర్ కి మంచి విజయం దక్కింది. హనుమాన్ తో వరుస అవకాశాలు వచ్చాయి. తను మాత్రం సెలెక్టివ్ గా చేస్తోంది. నరేష్ బచ్చలమల్లి కనిపిస్తోంది. ఇది కాకుండా మరి కొన్ని ఆఫర్లు చేతిలో వున్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది మిశ్రమ ఫలితం దక్కింది. విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ రిజల్ట్ చూసింది. అయితే కల్కి సినిమాలో ఓ క్యామియో చేసింది. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో వెయ్యికోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో తానూ ఓ పార్ట్ అయిన ఆనందం దక్కింది.
ఈ ఏడాది ఇద్దరు బాలీవుడ్ స్టార్లు టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. దీపికా పదుకొనే కల్కిలో కనిపించింది. ఆమెను రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి మంచి విజయం కావడంతో దీపిక టాలీవుడ్ ఎంట్రీ బ్లాక్ బస్టర్ అయ్యింది. శ్రీదేవి తనయ జాన్వి కపూర్ తెలుగు ఎంట్రీ ఈ ఏడాది జరిగింది. ఎన్టీఆర్ దేవరలో తంగం క్యారెక్టర్ లో కనిపించింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ కి చెప్పుకోదగ్గ పేరు రాకపోయినప్పటికీ పాటల్లో అదరగొట్టింది. చుట్టమల్లె పాట వైరల్ హిట్ అయ్యింది. ఇప్పుడు చరణ్, బుచ్చి బాబు సినిమాలో జాన్వినే హీరోయిన్.
ఈ ఏడాది సెన్సేషనల్ హీరోయిన్ అంటే భాగ్యశ్రీ బోర్సే పేరు చెప్పాలి. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినప్పటికీ భాగ్యశ్రీ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. డ్యాన్స్, గ్లామర్ అదరగొట్టింది. ఇప్పుడామె చేతిలో క్రేజీ ఆఫర్లు వున్నాయి. మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ తో మంచి హిట్ కొట్టింది. సుమతి పాత్రకు మంచి మార్కులు దక్కాయి. మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు మాత్రం నిరాశ పరిచాయి.
విజయాలు లేకపోయినా వరుస సినిమాలు చేసే హీరోయిన్ కావ్య థాపర్. ఈగల్, డబుల్ ఇస్మార్ట్, విశ్వం తో హ్యాట్రిక్ ఫ్లాప్ కొట్టింది. కృతి శెట్టి జాతకం మారలేదు. మనమే, మలయాళంలో చేసిన ఏఆర్ఎం సినిమాలు నిరాశపరిచాయి. డీజే టిల్లు 2తో అనుపమ పరమేశ్వరన్ చాలా రోజులకి మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇందులో చేసిన పాత్ర కూడా ఆమె ఇమేజ్ కి భిన్నమైనదే. ప్రియాంక మోహన్ సరిపోదా శనివారంతో హిట్ పట్టింది. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కానప్పటికీ మత్తువదలరా 2 తో ఫారియా అబ్దుల్లా హిట్ అందుకుంది. అయ్, క.. వరుస విజయాలని అందుకుని ప్రేక్షకు దృష్టిని ఆకర్షించింది కొత్త అమ్మాయి నయన సారిక. ఫైనల్ గా రష్మిక మందన పుష్పతో కలిసి రూల్ చేసింది. శ్రీవల్లిగా ఆమె నటన మరోసారి ఆకట్టుకుంది. సెకండ్ పార్ట్ లో మరింత నటించే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని చక్కగా వాడుతుంది. మరోవైపు బాలీవుడ్ లో చేసిన యానిమల్ ఘన విజయం సాధించి, రష్మికని అగ్ర కథానాయికగా మరో పదిమెట్లు ఎక్కించింది.