కావాలని చేస్తారో.. యథాలాపంగా చేస్తారో కానీ కొన్ని కొన్ని సార్లు రాజకీయ నేతలు చేసే చిన్న చిన్న పనుల వల్ల పార్టీ, పార్టీ క్యాడర్ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. వాటిని సరి చేసుకోవడం అంత తేలిక కాదు. పైగా పెంచుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏపీ మంత్రి పార్థసారధి పరిస్థితి అదే. స్వయంగా ఆయన వైసీపీ నుంచి వచ్చినప్పటికీ ఆహ్వానించిన టీడీపీ క్యాడర్.. ఓ వైసీపీ నేతతో కలిసి వేదిక పంచుకోవడాన్ని అసలు సహించలేకపోయారు. పార్థసారధిపై ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతోందంటే… ఆయన ఇప్పటికి రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణలు చెప్పారు. పూటకోసారి ట్వీట్ చేస్తారు. కార్యకర్తల మనోభావాల్ని మరోసారి దెబ్బతీయనని ప్రామిస్ చేస్తున్నారు.
జోగి రమేష్ తో పాల్గొన్న కార్యక్రమం పార్టీ రహితమైనది. అన్ని పార్టీల నేతలు వస్తున్నారు కాబట్టి పెద్ద సమస్య కాదని అనుకుని ఉంటారు. కానీ వైసీపీ హయాంలో చంద్రబాబుపైన, పార్టీ నేతలపైనా జోగి రమేష్ చేసిన దాడిని మాత్రం ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన అంతలా దాడిచేశారు. చాలా మంది వైసీపీ నేతలకు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండవచ్చు. గతంలో జగన్ వైసీపీ నేతలందరూ టీడీపీ నేతలంటే వ్యక్తిగత శత్రువుల్లానే చూడాలని కోరుకున్నారు. అలా చూసిన కొంత మంది ఇప్పుడు అందరికీ శత్రువులయ్యారు. ఎలాగోలా పార్టీ నేతలతో పాతసంబంధాలు పునరుద్దరించుకున్నా.. క్యాడర్ మాత్రం సహించే పరిస్థితి లేదు.
పార్థసారధికి ఎదురవుతున్న పరిస్థితులు అనేక మంది టీడీపీ నేతలకు కనువిప్పు లాంటివని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలతో ఏమైనాసంబంధాలు ఉంటే వారి కోసం లాబీయింగ్ చేయడం ఆపేసుకోవాల్సి ఉంటుంది. బహిరంగంగా వారితో తిరగడం మానేయాల్సిందిగా ఉంటుంది. ఏదైనా వ్యాపార సంబంధాలు ఉన్నా.. ఎప్పుడైనా బయటపడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇప్పుడే కట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటారు కానీ.. ఉండేలా చేశారు జగన్ రెడ్డి. ఆయన కాకుండా ఆయనను నమ్ముకున్నవారికి శత్రువుల్ని పెంచిపోయారు. ఈ పరిస్థితిని ఇతర టీడీపీ నేతలు గమనించి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.