తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల తమ పార్టీ జెండాల కన్నా టీడీపీ జెండాలే ఎక్కువ కనిపించేలా చేసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ ధ్యాంక్స్ చెప్పి వచ్చారు. అయితే ఇప్పుడు వారికి అధికారం నెత్తికెక్కింది. గెలుపు సంగతి తర్వాత ఇప్పుడు అసలైన రాజకీయం చేయాలనుకుంటున్నారు. అలా అనుకుని తాము ప్రయాణిస్తున్న బోటుకు చిల్లులు పెట్టుకుంటున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్ పేరుతో అమరావతిపై వైసీపీ వాయిస్ వినిపించారు. వరదల తర్వాత పెట్టుబుడులు పెట్టడానికి భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. అమరావతిలో వరదలు రాలేదని ఆయనకూ తెలుసు. కానీ ఆయన వైసీపీ వాయిస్ వినిపించాలనుకున్నారు.. వినిపించారు. దాని వల్ల తమ పార్టీకి ఎంత నష్టం చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ ను తీసేసి సెక్రటేరియట్ కట్టాలంటున్నారు. అక్కడ కడితే వ్యూ బాగుంటుందట. ఇలాంటి పిచ్చి మాటల వల్ల ఎవరికి నష్టమో ఆయనకు తెలియక కాదు. కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేందుకు మునుగోడు ఉపఎన్నిక తెచ్చి పరిస్థితి కాస్త మెరుగుపడే సరికి కాంగ్రెస్ లో చేరాడు ఆయన. చాన్స్ వస్తే కాంగ్రెస్ ను పాతరేసి మళ్లీ బీజేపీకి వెళ్లిపోతారు. ఇలాంటి రాజకీయ నేతలు సొంత రాజకీయ ఎదుగదలకు పార్టీని నిండా ముంచుతున్నారు.
ఏపీపై ఇప్పుడు వీరు విషం చిమ్మాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాక్యలు చేయాల్సిన అవసరం లేదు.కానీ వీరిది ప్రత్యేకమైన ఎజెండా. అదేమిటో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. ముందు ఆ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదు. కానీ ఇలా తమ పార్టీపై పదే పదే వ్యతిరేకత పెంచుకునే పనులు మాత్రం చేస్తున్నారు.