మగాడివి అయితే పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టు అన్ని అంశాలపై చర్చిద్దామని కేటీఆర్ సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అసెంబ్లీ సమావేశాలకు పూర్వ వైభవం వచ్చింది. చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు అందరూ చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు అసలు అసెంబ్లీ సమావేశాలు రికార్డుల కోసం జరిగాయి. జరిపామని చెప్పుకోవడానికి నిర్వహించారు కానీ ఎక్కడా.. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు.
పదేళ్ల పాటు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. మిగిలి ఉన్న నేతల్ని సస్పెండ్ చేసి తాము చెప్పాలనుకున్నది చెప్పుకుని వెళ్లిపోయేవారు. ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పుల్ని ప్రశ్నించడానికి అవకాశం కూడా ఉండేది కాదు. ఇలా ఎవరైనా ప్రశ్నిస్తారు అని అనుమానం ఉన్న వాళ్లపై అనర్హతా వేటు కూడా వేశారు. గవర్నర్ ప్రసంగంలో హెడ్ ఫోన్ విసిరేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లపై అనర్హతా వేటు వేసిన చరిత్ర కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఉంది. పదేళ్ల పాటు ప్రతిపక్షానికి వాయిస్ వినిపించేచాన్స్ ఇవ్వని..బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మగోడివి అయితే అన్నీ చర్చిద్దామని సవాల్ చేస్తున్నారు.
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో అన్నీ చర్చిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చర్చించడం ఇష్టంలేక సభలో బీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని కళ్ల ముందు కనిపిస్తున్న విషయం. బీఆర్ఎస్ తమ వాదనల్లో బలం ఉంటే.. సవాళ్లు కాదు చేయాల్సింది వాకౌట్ చేయకుండా చర్చల్లో పాల్గొనడం. అలా చేయకుండా పార్టీ సమావేశాల్లో మగోడివి అయితే.. దమ్ముంటే.. లాంటి మాటలు మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పదేళ్ల పాటు అసెంబ్లీ ఎలా జరిగిందో.. ఇప్పుడు ఎలా జరుగుతుందో ప్రజలు పోల్చి చూసుకుంటారు. మర్చిపోయే అవకాశం ఉండదు.