రాధిక పాప, టిల్లు హీరోయిన్ నేహాశెట్టి సూపర్ ఛాన్స్ కొట్టేసింది. పవన్ కల్యాణ్ OG లో ఓ ప్రత్యేక గీతంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ పాటని ధాయ్‌లాండ్ లో చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల నుంచీ.. షూటింగ్ జరుగుతోంది. నేహా కూడా తన ఇన్ స్టాలో ధాయ్ లాండ్లో ఉన్నా, ఓ షూటింగ్ కోసం వచ్చా అంటూ పోస్ట్ చేసింది. కానీ ఓజీ సంగతి చెప్పలేదు. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఈ పాటలో పవన్ కనిపిస్తాడా, లేదా? అనేది డౌటు. ఒకవేళ పవన్ పార్ట్ ఉంటే, దాన్ని విడిగా షూట్ చేసి, మ్యాచ్ చేసే అవకాశం ఉంది.
నేహాకు ఇది చాలా మంచి ఆఫర్ అనుకోవొచ్చు. టిల్లు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది నేహా. అయితే.. బడా స్టార్ సినిమాల నుంచి ఎలాంటి అవకాశాలూ రాలేదు. అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే పడ్డాయి. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా సరే, ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. పైగా పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఓజీపైనే అభిమానులు నమ్మకాలు పెట్టుకొన్నారు. ఈ సినిమాలో ప్రతీ మూమెంట్ వాళ్లకు ప్రత్యేకమే. కాబట్టి నేహాకు ఇది బిగ్గెస్ట్ సినిమా కాబోతోందనడంలో ఎలాంటి డౌట్ లేదు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పాట మంచి బీట్ తో, రాప్ స్టైల్లో సాగుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఓజీకి సంబంధించి ఓ అప్ డేట్ ఇవ్వబోతోంది చిత్రబృందం. మరి.. అందులో నేహాశెట్టి గురించి చెబుతారో లేదో చూడాలి.