కాలం మారుతున్న కొద్దీ ఆదాయ, వ్యయాలతో పాటు భవిష్యత్ గురించి ఆలోచించేవారు కూడా పెరుగుతున్నారు. ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి వచ్చే పెన్షన్ల కోసం ఎదురు చూసే బదులు..మెల్లగా ఇప్పుడే పెట్టుబడి పెట్టి.. ఆ తర్వాత అద్దె ఆదాయాలు తెచ్చుకుంటే చాలా బెటర్ కదా అని ఆలోచన చేస్తున్నారు. అందుకే ఉండటానికి ఓ ఇల్లు చూసుకుని అద్దెలకు ఇచ్చుకునేందుకు మరో ప్రాపర్టీని వైపు చూస్తున్నారు.
గతంలో హోమ్ లోన్స్ అంత ఎక్కువగా అందుబాటులో ఉండేవి కావు. జీవితాంతం సంపాదించిన సొమ్ముతోనే రిటైర్మెంట్ దశలో ఇల్లు కట్టుకునేవారు. కానీ ఇప్పుడు కెరీర్ ప్రారంభంలోనే జాగ్రత్త పడితే ఇల్లు కొనేసుకోవచ్చు. జీతం పెరుగుతూ ఉంటుంది కానీ .. హోంలోన్ ఈఎంఐ మాత్రం పెరగదు. అదే లాజిక్ తో.. పదేళ్లకు హోమ్ లోన్ తీర్చుకునేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారు ..ఎక్కువ మంది రెండో ఇంటి కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. వారు దాన్ని అద్దె ఆదాయం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు.
కాస్త దూరం అయినా తమ ఆదాయాలు తగ్గిపోయేసరికి మంచి రెంట్ వచ్చేలా చూసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు శివారు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్న వారిలో ఎక్కువ మంది రెండో ఇంటి కోసం ప్రయత్నిస్తున్న వారేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎదైనా పెన్షన్ ఫండ్ లో పెట్టుబడి పెడితే అరవై ఏళ్ల తర్వాత ఆరేడు వేల పెన్షన్ వస్తుంది. అప్పటికి ఆరేడు వేలకు ఏ వస్తువులు రాని పరిస్థితి వస్తుంది. అదే అద్దె ఆదాయం అయితే ఏటికేడు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఆలోచనతో ఎక్కువ మంది రెండో ఇల్లు వైపు చూస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.