అర్జున్ ను అరెస్టు చేసినప్పుడు ఆయన ఫ్యాన్స్ కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు రాజకీయ పార్టీల కార్యకర్తలే ఎక్కువ స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించడానికి కావాల్సినంత స్టఫ్ వచ్చిందని రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టారు. వీటిలో చాలా వరకూ గీత దాటిపోయాయి. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం దగ్గర నుంచి చాలా ఘోరంగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు అలాంటి వాటిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు పెట్టడం ప్రారంభించారు.
రేవంత్ ను.. ప్రభుత్వాన్ని దూషిస్తూ అనుచితంగా పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటి వరకూ నాలుగు కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే అరెస్టును సమర్థించిన వారి కుటుంబసభ్యులను కూడా బెదిరిస్తూ కొంత మంది పోస్టులు పెట్టారు. వారిపైనా కేసులు పెట్టినట్లుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఏం రాసినా వాక్ స్వేచ్చ కింద తప్పించుకోవచ్చని అనుకుంటున్నారని.. అలాంటి అవకాశం లేదని చెబుతున్నారు. సోషల్ మీడియా పోస్టులలో దూషించేవారిని క్షమించే ప్రసక్తే లేదంటున్నారు.
సాధారణంగా ఆవేశానికి గురయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వారు పోస్టులను డిలీట్ చేసుకున్నా పట్టించుకునే అవకాశం లేదు కానీ రాజకీయ ముసుగులో అల్లు అర్జున్ కు మద్దతు అంటూ .. రేవంత్ ను నిందించిన వారిని .. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారిని మాత్రం వదిలి పెట్టేది లేదని పోలీసులు చెబుతున్నారు.