యూ ట్యూబర్, నటుడు ప్రశాంత్ బెహరా అరెస్ట్ అయ్యారు. సహచర నటిపై లైంగిక వేధింపులు, దాడికి యత్నం కేసులో ప్రసాద్ బెహరాని అరెస్ట్ చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు. అనంతరం కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడా కారాగారానికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే… ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో తనతో ప్రసాద్ బెహరా అసభ్యంగా ప్రవర్తించాడని, అయితే అప్పుడే నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని, అయితే ఆ తరవాత మరో షూటింగ్ లో కూడా ఇలానే అభ్యంతరకంగా తన శరీరాన్ని తాకే ప్రయత్నం చేశాడని, ఇదేమిటని అడిగితే, పరుష పదజాలంతో తనని నానా మాటలూ అన్నాడని, ఆ తరవాత ఇంటికి వెళ్తున్న దారిలో, దాడికి సైతం ప్రయత్నించాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి సాక్ష్యాలు కూడా బలంగా ఉండడంతో ప్రసాద్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. అనంతరం కోర్టుకు హాజరు పరిచారు.
యూ ట్యూబ్ ద్వారా నటుడిగా సుపరిచితమయ్యాడు ప్రసాద్. సహజమైన నటన, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకొన్నాడు. తను మంచి రైటర్ కూడా. ఓ దశలో.. `ఓజీ` సినిమాకు పని చేసే అవకాశం వచ్చింది. అయితే అది తృటిలో చేజారిపోయింది. ఇప్పుడు వెండి తెరపై నటుడిగా బిజీ అయ్యాడు. నరేష్ నటించిన `బచ్చలమల్లి`లో ఓ పాత్ర పోషించాడు. ఈ సినిమా ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది.