నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది మోక్షజ్ఞ ఎంట్రీ గురించే. ప్రశాంత్ వర్మకు ఈ ప్రాజెక్ట్ అప్పగించారు. ఆమధ్యే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారని, ఈ సినిమా ఇక ముందుకు వెళ్లదని, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మోక్షు డెబ్యూ ఉంటుందని ప్రచారం మొదలైంది.
అయితే ఇప్పుడు ఓ కీలక ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోలేదని, ఈ ప్రాజెక్టుపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ సైతం విడుదల చేశారు. ఈ కాంబోలో సినిమా ఉంటుందని, కాకపోతే కాస్త ఆలస్యమవుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ప్రశాంత్ వర్మకీ మోక్షజ్ఞ కీ కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయని, క్రియేటీవ్ డిఫరెన్సెన్స్ వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేని పరిస్థితుల్లో ఉందని చెప్పుకొన్నారు. వాటిలో కొంత నిజం ఉన్న మాట కూడా వాస్తవమే. ప్రశాంత్ వర్మ సైతం, మోక్షజ్ఞ సినిమాపై ఆశలు వదులుకొని, ప్రభాస్ తో సినిమా పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. అయితే ఈలోగా బాలకృష్ణ రంగంలోకి దిగారు. ప్రశాంత్ వర్మకు సర్దిచెప్పి, మళ్లీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటికే చాలాకాలంగా ప్రశాంత్ వర్మ వర్క్ చేస్తున్నారు. చాలామంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు అడ్వాన్సులు ఇచ్చారు. ఈ కథ మోక్షజ్ఞకు తప్ప ఇంకెవ్వరికీ సెట్ అవ్వదని తెలుస్తోంది. అందుకే ప్రశాంత్ వర్మ కూడా ఈ సినిమాని ఎలాగైనా పట్టాలెక్కించాలని భావించారు. ఇప్పుడు బాలయ్య సయోధ్యతో మార్గం సుగమం అయ్యింది.