ప్రభుత్వానికి రెవిన్యూ సమస్యలు అతి పెద్ద సమస్యగా ఉన్నాయి. భూముల రికార్డులు సరిగ్గా లేకపోవడం,అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడటం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వం అసలు సమస్యలు లేని రెవిన్యూ వ్యవస్థను సృష్టిస్తామని.. భూ వివాదాలు లేకుండా చేస్తామని ప్రకటనలు చేస్తూ కొత్త కొత్త విధానాలను పరిచయం చేస్తూ ఉంటాయి. కానీ అవి మరికొన్ని సమస్యలకు కారణం అవుతున్నాయి. ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి.
అసలు సమస్యలే లేకుండా చేస్తానని కేసీఆర్ ప్రభుత్వం ధరణిని తీసుకు వచ్చింది. ఆ ధరణి వల్ల సమస్యలు పోకపోగా రెట్టింపు అయ్యాయి. వాటి బారిన పడి తమ భూమి పోయిందని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ భూమిచాలా వరకూ అన్యాక్రాంతమయిందన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ హామీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని ఫలితాలను బట్టి స్పష్టమయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూభారతి అనే విధానాన్ని అమలులోకి తెస్తామని బిల్లును ప్రతిపాదించింది.
ఇప్పుడు కూడా ప్రభుత్వం అసలు భూ సమస్యలు లేని తెలంగాణను చూడటానికే ఈ బిల్లు తెచ్చామని చెబుతోంది. అనేక రాష్ట్రాల్లో పరిశీలనలు చేశామని.. ప్రజలకు మేలు చేసే బిల్లును తెచ్చామని అంటున్నారు. ధరణిలో సమస్యలకు కారణం అయిన వాటిని గుర్తించి వీటిలో పరిష్కారాలను కనుగొన్నామని అంటున్నారు. అయితే ఈ బిల్లు విషయంలోనూ కాంగ్రెస్ అనేక విమర్శలు ఎదుర్కొంటుంది.. అందులో సందేహం లేదు. అయితే పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నారు.
ప్రభుత్వాలు చట్టాల్లో ఏం చేర్చినా అమలు పక్కాగా ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. భూ వ్యవహారాల్లో అవినీతి ఎంత ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దాన్ని అరికట్టేలా చర్యలు ఉంటే.. వందశాతం కాకపోయినా కనీసం యాభై శాతం సమస్యలను తగ్గించగలిగినా ప్రజల నుంచి సపోర్టు వస్తుంది. కానీ వారి ఆస్తులకే రక్షణ లేని పరిస్థితి వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.