జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లును పంపించారు. ఓటింగ్ నిర్వహించి మరీ పంపించారు. సాధారణంగా ఫలానా బిల్లును జేపీసీకి పంపాలని.. ఫలానా అంశంపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూంటాయి. కానీ జమిలీ బిల్లును మాత్రం కేంద్రం బలవంతంగా జేపీసీకి పంపింది. 31 మందితో కమిటీని ప్రకటించింది. అందులో 21 మందిలోకి సభ సభ్యులు. పది మంది రాజ్యసభ సభ్యులు. లోక్ సభ సభ్యుల వివరాల్ని ప్రకటించారు. టీడీపీ నుంచి హరీష్ బాలయోగికి అవకాశం దక్కింది. జనసేన నుంచి బాలశౌరి ఉన్నారు. బీజేపీ నుంచి సీఎం రమేష్ కూడా ఉన్నారు. కానీ వైసీపీ నుంచి ఎవర్నీ చేర్చలేదు. రాజ్యసభ సభ్యుల్లో ఉండే పది మందిలో వైసీపీ నుంచి ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది.
పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. వాట్ నెక్ట్స్ ?. ఈ కమిటీ మూడు నెలల పాటు సంప్రదింపులు జరుపుతుంది . ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తమ నివేదికను స్పీకర్ ముందు ఉంచుతుంది. మరి ఆ తర్వాత బిల్లు పాస్ అవుతుందా అంటే..దాదాపు సాధ్యం కాదని చెప్పాలి. పాస్ అవుతుందని అనుకుంటేనే కేంద్రం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సాధారణ బిల్లులు అయితే సింపుల్ మెజార్టీతో చట్టాలుగా మార్చేయవచ్చు. కానీ రాజ్యాంగసవరణ చేయాలంటే కనీసం మూడింట రెండువంతుల మెజార్టీ ఉండాలి. ప్రస్తుతం ఉన్న నెంబర్స్ ను బట్టి చూస్తే అది అసాధ్యంగా కనిపిస్తోంది. చాలా పార్టీలు తమ విధాలను స్పష్టం చేశాయి. మార్చుకునే అవకాశం లేదు.
కొన్ని పార్టీలు తమ విధానాలను మార్చుకుంటే తప్ప జమిలీ బిల్లు .. రాజ్యాంగసవరణతో పాస్ అయ్యే అవకాశం లేదు. అంటే… మూడు నెలల తర్వాత కాదు..ఆరు నెలల తర్వాత అయినా ఆ బిల్లు బ ఆటకు రావడం చాలా కష్టమని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే ఇలాంటి నెంబర్స్ మ్యాజిక్ చేయడంలో బీజేపీ,అమిత్ షా కు చాలా అనుభవం ఉంది. వారే ఏదో ఒకటి చేస్తారన్న నమ్మకాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. చేయగలుగుతారా లేదా అన్న దాన్ని బట్టే జమిలీ బిల్లు ముందుకు సాగుతుంది.