ఉపేంద్రకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన కథలు, స్క్రీన్ ప్లే, పాత్రలు అన్నీ కొత్తగా ఉంటాయి. చెప్పాలనుకొన్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తాడు. టైటిల్స్‌కూడా ఆకట్టుకొనేలా సాగుతాయి. ఓ కన్నడ హీరోకంటూ తెలుగులో మార్కెట్ తీసుకొచ్చిన మొదటి హీరో ఉపేంద్రనే. కన్నడలో ఎంతమంది స్టార్స్ వచ్చినా, ఉపేంద్ర స్థానం ఉపేంద్రకే ఉంది. ఇప్పుడు తన నుంచి `యూఐ` అనే సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ ఆసక్తికరంగా సాగాయి. విజువల్స్ కొత్తగా అనిపించాయి. దాంతో పాటు ఉప్పీ గెటప్ కూడా తనదైన స్టైల్ లో ఆకట్టుకొంటుంది. ఈమధ్య ఉపేంద్ర ఎన్ని సినిమాలు చేసినా రానంత క్రేజ్, బజ్ ఈ సినిమాకు వచ్చింది. పైగా దాదాపు తొమ్మిదేళ్ల తరవాత ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. అందుకే.. ఆ బజ్ మరింత పెరిగింది. దానికి తోడు ప్రమోషన్లు కూడా స్పీడుగానే చేశాడు.
ఈ సినిమా కథేంటి? అనే విషయాన్ని ఉపేంద్ర ఇప్పటి వరకూ ఎక్కడా బయటపెట్టలేదు. కాన్సెప్ట్ కూడా చెప్పలేదు. అయితే ఇది గ్లోబల్ వార్మింగ్‌కి సంబంధించిన కథని తెలుస్తోంది. రాజకీయ నాయకులు ప్రజల్ని బకరాలుగా ఎలా చేసి, తమ స్వార్థానికి వాడుకొంటున్నారో, ఉచిత పధకాలతో ఎంత ప్రమాదమో ఈ సినిమాతో చెప్పబోతున్నాడట ఉపేంద్ర. చాలా పాత్రలు, డైలాగులు సమకాలీన రాజకీయ స్థితిగతుల్ని ఎండగడతాయని తెలుస్తోంది. రన్ టైమ్ కూడా షార్ప్‌గా ఉంది. 2 గంటల 13 నిమిషాలు మాత్రమే. ఈ శుక్రవారం బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ లేదు. బచ్చలమల్లి, విడుదల 2 రిలీజ్ అవుతున్నాయి. ఉపేంద్ర సినిమాలకు మాస్లో క్రేజ్ ఎక్కువ. కాబట్టి… ఈ సినిమాకు అక్కడ టికెట్లు బాగా తెగే అవకాశం ఉంది.