చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ఒకప్పుడు హైదరాబాద్ నుంచి చాలా దూరం అనుకునేవారు. కానీ ఔటర్ నిర్మాణం తర్వాత మొత్తం మారిపోయింది. ఇప్పుడు చిలుకూరు కూడా సిటీలో భాగం అయిపోయింది. మొహదీపట్నం నుంచి కాళీ మందిర్ మీదుగా చిలుకూరు వైపు గత పదేళ్లలో పెద్ద ఎత్తున కాలనీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఔటర్ నానక్ రామ్ గూడ వైపు నుంచి కూడా రవాణా సౌకర్యం బాగా మెరుగుపడటంతో ఇక తిరుగులేకుండా పోయింది.
పదేళ్ల కిందట కాళీ చిలుకూరుకు వెళ్లే రోడ్డులో కాళీ మందిర్, బండ్లగూడ జాగీర్‌లో కాలనీల నిర్మాణం ప్రారంభమయింది. అంతకు ముందు ఉన్న కాలనీలు నిర్మానుష్యంగా ఉండేవి. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభమయి.. ఊపందుకోవడంతో ఇప్పుడు కిక్కిరిసిపోయాయి. ఔటర్ వరకూ కాలనీలు ఏర్పడ్డాయి. ఐటీ కారిడార్ కు రవాణా సౌకర్యం, రోడ్డు మార్గం మెరుగుపడటంతో తిరుగులేని విధంగా అభివృద్ధి చెందింది. పదేళ్ల కిందట ఇరవై లక్షలకు వచ్చిన ఇళ్లు ఇప్పుడు కోటి రూపాయల వరకూ పలుకుతున్నాయి.
బండ్లగూడ జాగీర్ ప్రాంతం దాటిన తర్వాత బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు హౌసింగ్ ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి. అయితే ఇప్పటికీ చిన్న చిన్న బిల్డర్లు పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మిస్తున్నారు . వారు అందుబాటు ధరల్లోనే విక్రయిస్తున్నారు. కాస్త లోపలికి తిరిగి వాకబు చేస్తూ రూ. అరవై లక్షల నుంచి అపార్టుమెంట్లు ఫ్లాట్లు లభిస్తున్నాయి. కిస్మత్పూర్, సికందర్గూడ, గండంగూడ, హైదర్షాకోట్ , పీరంచెరువు వైపు కూడా కాలనీలు విస్తరించాయి. అక్కడకూడా అందుబాటు ధరల్లోనే ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం మొహది పట్నం నుంచి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. గచ్చిబౌలి నుంచి పధ్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది.