అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీసు గేమ్ ఛేంజర్ అయినప్పటికీ.. ఏడాది మొత్తం బాక్సాఫీస్‌ను నడిపించేది యంగ్ హీరోలు, మీడియం, చిన్న సినిమాలే. 2024లోనూ యంగ్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. ఇందులో కొందరు ఆడియన్స్ ని అలరించి విజయాలు అందుకుంటే, ఇంకొందరు ఊరించి ఉసూరనిపించారు.
2024 ఓ అనూహ్య విజయంతో మొదలైంది. తేజసజ్జా, ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన హనుమాన్ పాన్ ఇండియాలో సత్తా చాటింది. నిజానికి సంక్రాంతి బరిలో అండర్ డాగ్ సినిమాగా దిగింది హనుమాన్. సరైన థియేటర్స్ కేటాయించలేదనే వివాదం నడిచింది. కొన్ని చోట్ల హనుమాన్ కటౌట్స్ ని తొలగించడం కూడా వార్తల్లో నిలిచింది. ఐతే ఇవన్నీ దాటుకొని గొప్ప ప్రేక్షకాదరణతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కెరీర్ బిగినింగ్ లోనే ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా నిలిచాడు తేజసజ్జా. ఇదంతా హనుమంతుల వారి మ్యాజిక్ అనే చెప్పాలి.
సందీప్ కిషన్ ఊరు పేరుభైరవ కోన లాంటి యావరేజ్ తో సరిపెట్టుకున్నాడు. వరుణ్ తేజ్ కి ఈ ఏడాది కలిసి రాలేదు. ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలు దెబ్బకొట్టాయి. మట్కాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని సైతం కదిలించలేకపోయింది.
గోపీచంద్ భీమా, విశ్వం చిత్రాలతో వచ్చాడు. ఈ రెండూ ఆశించిన విజయాలు ఇవ్వలేదు. విశ్వం లాభాలు తెచ్చిందని నిర్మాతలు చెప్పినప్పటికీ శ్రీను వైట్ల, గోపీచంద్ నుంచి ఆశించిన సినిమా కాలేకపోయింది.
విశ్వక్ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు వచ్చాయి. గామి విమర్శకులు ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీసు వద్ద నిలవలేదు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మెకానిక్ రాకీ టార్గెట్ రీచ్ అవ్వలేదు. శ్రీవిష్ణు ఓ భీమ్ బుష్ తో ఓ హిట్ అందుకున్నాడు. కామెడీ ని ఆశించిన ఆడియన్స్ ని తృప్తి పరిచిన సినిమా ఇది. స్వాగ్ మాత్రం నిరాశపరిచింది. కాకపోతే ఇందులో చేసిన హిజ్రా పాత్ర నటుడిగా తనకి ఆనందాన్ని ఇచ్చింది.
డిజే టిల్లు 2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు సిద్దు జొన్నలగడ్డ. కావాల్సినంత వినోదాన్ని అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి సందడి చేసింది. సిద్దు స్టార్ట్ డమ్ ఈ సినిమాతో మరింత పెరిగింది. విజయ్ దేవరకొండకి ఈ ఏడాది కలిసి రాలేదు. ఫ్యామిలీ స్టార్ కి డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది.
తండ్రి ఈవివి క్లాసిక్ టైటిల్ ఆ ఒక్కటీ అడక్కు వాడుకొని అల్లరి నరేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ వారం వస్తున్న బచ్చల మల్లిపైనే ఆశలు పెట్టుకున్నాడు. శర్వానంద్ మనమే ఎలాంటి ప్రభావం చూపించలేదు. సుదీర్ బాబు హరోం హర, మానాన్న సూపర్ హీరో చిత్రాలు .. రెండూ విడుదలకు ముందు ఆసక్తిని పెంచాయి. రిలీజ్ తర్వాత ఉసూరనిపించాయి.
స్కందతో దెబ్బతిన్న రామ్ పోతినేనికి డబుల్ ఇస్మార్ట్ డబుల్ షాక్ ఇచ్చింది. పూరి మాస్ మంత్ర పారలేదు. ఆర్ఎక్స్100 లాంటి మరో విజయం కోసం ప్రయత్నిస్తున్న కార్తికేయ భజేవాయు వేగంతో ఆ టార్గెట్ ని రీచ్ కాలేదు.
కథల ఎంపికలో మంచి జడ్జ్మెంట్ తో ముందుకు వెళుతున్న నాని.. ఈఏడాది కూడా మరో హిట్ అందుకున్నాడు. సరిపోదా శనివారంతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎస్జే సూర్య ఫ్యాక్టర్ సినిమాకి కలిసొచ్చింది. కాకపోతే వరదలు ఈ సినిమాని ఇబ్బంది పెట్టాయి. లేకుంటే రిజల్ట్ ఇంకా బెటర్ గా వుండేది.
లక్కీ భాస్కర్ తో తెలుగులో హ్యాట్రిక్ పూర్తి చేశాడు దుల్కర్ సల్మాన్. ఈ దీపావళి విన్నర్ గా నిలచాడు. ‘క’ సినిమా కిరణ్ అబ్బవరం కు మంచి ఊరట ఇచ్చింది. గత కొద్దికాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన కిరణ్.. ‘క’ వినూత్న ప్రయత్నంతో ప్రశంసలు అందుకున్నాడు. సినిమా కాన్సెప్ట్, ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి.
నిఖిల్ కి ఈఏడాది సినిమా లేదు. కానీ ఎప్పుడో ఆగిపోయిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాని ఓటీటీ రిలీజ్ కోసం మరామత్తులు చేసి థియేటర్ లో వదిలారు. ఈ సినిమా ఎవరికీ పట్టలేదు.
ఈ ఏడాది సత్తా చాటిన చిన్న సినిమాలు వున్నాయి. శ్రీసింహ, సత్య ‘మత్తువదలరా 2′ తో మరోసారి మ్యాజిక్ చేశారు. ’35 చిన్న కథ కాదు’ మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంది. కమిటీ కుర్రాళ్ళు సినిమాకి మంచి మార్కులు పడ్డాయ్. నార్నే నితిన్ బడ్డీ కామెడీ ‘ఆయ్’ థియేటర్స్ కి జనాల్ని రప్పించగలిగింది.
అల్లు శిరీష్ బడ్డీ, ప్రియదర్శి డార్లింగ్ ప్రభావం చూపలేదు. సుహాస్ చేసిన అంబాజీ పేట, ప్రసన్నవదనం, జనక అయితే గనక.. ఈ మూడు సినిమాలూ ఆడియన్స్ ని రప్పించలేకపోయాయి. సత్యదేవ్ కృష్ణమ్మ విడుదలకుముందు అంచనాలు పెంచింది. కానీ రిజల్ట్ తేడా చేసింది. జీబ్రా తో ఓ కొత్త సబ్జెక్ట్ ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది.
నాగచైతన్య, అఖిల్, నితిన్, నవీన్ పోలిశెట్టి, సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నాగశౌర్య, అడివి శేష్, వైష్ణవ్ తేజ్.. ఈ ఏడాది ఖాతా తెరవలేదు.