ఇదిగో అదిగో అంటూ చాలా కాలంగా నలుగుతున్న ప్రచారం చివరికి నిజమైంది. కేటీఆర్ పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఏ 2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్.. ఏ త్రీగా బీఎల్ఎన్ రెడ్డి అనే వ్యక్తిని చేర్చింది. తాము కేటీఆర్ పై పీసీయాక్ట్ కింద కేసులు పెట్టామని నాంపల్లి కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టుచేయడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించే సంస్థకు రూ. 55 కోట్లు అక్రమంగా బదిలీ చేశారనేది కేసు. ఎవరి అనుమతి లేకుండా డబ్బులు పంపారు. తాము ఉద్దేశపూర్వకంగా ఆ నిధులు బదిలీ చేయలేదని.. హైదరాబాద్ కోసమే బ దిలీ చేశానని అంటున్నారు. అయితే ఎందు కోసం బదిలీ చేశారన్నది రికార్డుల్లో ఉండాలని..కానీ ఆ డబ్బుల్ని విదేశీ కంపెనీ ఖాతాకు.. ఎలాంటి లెక్కాపత్రం లేకుండా పంపేశారని అంటున్నారు. అదీ కూడా ఇండియన్ కరెన్సీలో చెల్లించడంతో ఆర్బీఐ పైన్ కూడా వేసిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
కేటీఆర్ అరెస్టు కావడానికి రెడీగా ఉన్నారు. చాలా రోజులుగా అదే చెబుతున్నారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరం. ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తారా లేకపోతే.. వెంటనే అరెస్టు చేసి ఆ తర్వాత కసట్డీకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా కేటీఆర్ ను అరెస్టు చేస్తే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.