రాజధాని ప్రాంతంలో అబివృద్ధి పేరిట దేవాలయాలు, చర్చిలు ప్రభుత్వం కూల్చివేయడాన్ని వైకాపా నేత పార్ధ సారధి తీవ్రంగా ఖండించారు. తెదేపా మిత్రపక్షమైన భాజపా కూడా దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. నరసాపురం భాజపా ఎంపి గోకరాజు గంగరాజు స్పందించారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ముస్లిం రాజులు దేవాలయాలను కూల్చివేసినట్లుగా తెదేపా ప్రభుత్వం కూడా దేవాలయాలను కూల్చివేస్తోందని విమర్శించారు. రోడ్లు విస్తరణ, అభివృద్ధి పేరిట విజయవాడ పరిసర ప్రాంతాలలో అధికారులు ఇష్టం వచ్చినట్లు హిందూ దేవాలయాలు కూల్చివేస్తుంటే తెదేపా ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. అధికారుల చేస్తున్న పని వలన ప్రజల మనోభావాలు దెబ్బ తింటున్నాయని, ఇకనైనా అటువంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు.
ఇప్పటికే కాంగ్రెస్, వైకాపాలు ప్రభుత్వ వైఖరిని గట్టిగా ఖండిస్తున్నాయి. ఇప్పుడు వాటితో భాజపా గొంతు కలిపింది. బహుశః నేడో రేపో మరికొందరు రాష్ట్ర భాజపా నేతలు కూడా ఆయనతో గొంతు కలుపవచ్చు. అప్పుడు ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక అటువంటి పరిస్థితి రాక మునుపే అప్రమత్తం అవడం మంచిది. ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్లి ఉండి ఉంటే ఇటువంటి సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ అటువంటి ఆలోచన చేయకుండా వాటిపై ఎదురుదాడికి దిగడం వలన సమస్య ఇంకా జటిలం అవుతుంది.
తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సరిగ్గా అదే పని చేశారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన గోకరాజు గంగరాజుపై ఎదురుదాడి చేశారు. “మిత్రపక్షానికి చెందిన గంగరాజు మా ప్రభుత్వంపై అటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. అధికారులు కేవలం ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నారు తప్ప ఆలయాలని కాదని ఆయన తెలుసుకొంటే మంచిది. అయినా మా ప్రభుత్వం హిందూ దేవాలయాలని ఎందుకు తొలగిస్తుంది? మేమేమీ వారికి వ్యతిరేఖం కాదే? ఆయన తన ఆరోపణలను ఉపసంహరించుకొంటే బాగుంటుంది,” అని అన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఇటువంటి సవాళ్లు, ప్రతిసవాళ్ళు విసురుకోవడం వలన సమస్య పక్కదారి పట్టి దానిపై కూడా రాజకీయాలు మొదలవుతాయి. తెదేపా, భాజపా మిత్రపక్షాలుగానే ఉన్నాయి కనుక మీడియా ముందుకు వచ్చి ఈవిధంగా ఒకరినొకరు విమర్శించుకోవడం కంటే ఇరు పార్టీల నేతలు క్షేత్ర పర్యటనకి వెళ్లి పరిస్థితిని సమీక్షించి, తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు కదా? అనవసరమైన ఈ వివాదాల వలన వారే నష్టపోతారని గ్రహిస్తే మంచిది. రాజకీయనాయకులు వీలైతే ఇటువంటి సమస్యలని సామరస్యంగా పరిష్కరించాలి లేదా వాటికి దూరంగా ఉండాలి తప్ప ఇంకా జటిలం చేయడం తగదు. ఎందుకంటే రాష్ట్రం మరొక కొత్త సమస్యని భరించే స్థితిలో లేదు.