బీజేపీ ఎంపీలపై రాహుల్ గాంధీ దాడి చేశారని ఓ ఎంపీని ఐసీయూలో చేర్చేశారు. ఆయనకు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మెడికల్ రిపోర్టు లేదు. గాయం అయినట్లుగా ఫోటో లేదు. ఆయన తన తలకు కర్చీఫ్ అడ్డం పెట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. తర్వాత ఆస్పత్రిలో చేరిపోయారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. కేసు నమోదు ఇలా జరిగిపోతూ ఉంది.
పార్లమెంట్ ఆవరణలో ప్రతి మూల హై క్వాలిటీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. ప్రధాన ద్వారం దగ్గర ఘటన జరిగిందని చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దృశ్యాలు కూడా ఉంటాయి. మరి వాటిని ఎందుకు బయట పెట్టలేదు?. తాము తోసేయలేదని.. ఆ ఎంపీలే అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయంలో మామూలుగా రాహుల్ గాంధీ కనీసం తోసేసినట్లుగా ఉన్నా సరే దృశ్యాలను మీడియా, సోషల్ మీడియాలో రచ్చ చేసేవారని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆధారం లేదు కాబట్టే.. రిలీఫ్ చేయలేదని అనుకుంటున్నారు.
ఈ రాజకీయం జగడానికి కారణం.. కాంగ్రెస్ పార్టీ అంబేద్కేర్ పేరుతో రాజకీయం చేయడమే. అమిత్ షాకు అంబేద్కర్ ను అవమానించాలన్న ఉద్దేశం ఉండదని కాంగ్రెస్ కూ తెలుసు. కానీ ఆయన అన్న మాటల్ని పట్టుకుని మనోభావాల రాజకీయం చేయాలనుకుంది. దానికి బీజేపీ ఇలా కౌంటర్ ఇస్తోంది. ఇక్కడ రెండు పార్టీలు కలిసిపోయి దిగజారిపోయిన రాజకీయ గేమ్ ఆడుతున్నాయి. ఇది మన రాజకీయ రోగం అనుకోవచ్చు.