మోహన్ బాబు మళ్లీ పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. ముందస్తు బెయిల్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకూ అరెస్టు చేయకుండా రక్షణ ఇవ్వలేమని కోర్టు చెప్పేసింది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తే అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పనికి రాకుండా పోతుంది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. ఈ రిస్క్ అంతా ఎందుకు ఈ మూడు రోజులు ఎవరికీ కనిపించకుండా పోతే చాటని మోహన్ బాబు అనుకున్నట్లుగా ఉన్నారు. జల్ పల్లి హౌస్ నుంచి ఆయన కనిపించకుండా పోయారు.
పోలీసులు ఆయనను అరెస్టు చేస్తారో లేదో తెలియదు.వారి వ్యూహం ఏమిటో స్పష్టత లేదు. ఇరవై నాలుగో తేదీ వరకూ కోర్టు నోటీసుల విషయంలో మాత్రం రిలీఫ్ ఇచ్చింది. పోలీసుల ఎదుట హాజరుకాకుండా అవకాశం ఇచ్చింది. కానీ నేరుగా అరెస్టు చేయవద్దని మాత్రం చెప్పలేదు. మోహన్ బాబుకు ఇదే పెద్ద వర్రీ అయిపోయింది. ఈ వయసులో అరెస్టు అయిపోి జైల్లో ఉండలేరు. పోనీ ఇదేమైనా పబ్లిక్ తో సంబంధం ఉన్న కేసా ఆంటే.. కుటుంబ కొడవల్లో సహనాన్ని కోల్పోయి మీడియాపై దాడి చేశారు. ఆ మీడియా ప్రతినిధి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు.
ఈ కేసు ఎలాగోలా సెటిల్ చేసుకుందామనుకున్నా అవకాశం లేకుండా పోయింది. రిపోర్టర్ చేతిలో ఉంటే.. ఆయనతో మాట్లాడి ఏదో విధంగా రాజీ చేసుకునేవారు.కానీ ఇది ఆయన పరిధిని దాటిపోయింది. ఆయన కు.. ఆయన కుటుంబసభ్యులకు మోహన్ బాబు వెళ్లి క్షమాపణలు చెప్పి వచ్చారు. కానీ పెద్దగా తేడా లేదు. ఇప్పుడు కుటుంబ గొడవలు పరిష్కరించుకోవడం కన్నా.. హత్యాయత్నం కేసు నుంచి ఎలా బయటపడాలన్నది ఇప్పుడు మోహన్ బాబు ముందున్న అది పెద్ద ప్రశ్న.