కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “గత దశాబ్దకాలంగా రాజకీయ పార్టీలు వాటి రాజకీయ మైలేజ్ కోసం నన్ను ఎప్పుడూ వాడుకొంటూనే ఉన్నాయి,” అని అన్నారు.
“ఆ సంగతి నాకు అర్ధమైంది కనుకనే నేను ఎన్నడూ చింతించలేదు. ఆరోపణలకి భయపడలేదు. నాపై ఆరోపణలు చేస్తున్నవారెవరూ వాటిని నిరూపించి చూపలేకపోతున్నారు. కారణం వారి వద్ద అందుకు సాక్ష్యాధారాలు లేవు కనుక. అసలు నిరూపించడానికి ఏముందని? వారు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు కాలపరీక్షకి నెగ్గలేకపోతున్నాయి. అందుకే నేను ఎప్పుడు తలెత్తుకొని జీవించగలుగుతున్నాను,” అని వాద్రా అన్నారు.
అయనపై భూ కుంభకోణాలకి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగిన భూ కుంభకోణంలో ఆయనకి చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థకి ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఈడి ఇటీవలనే దానికి నోటీసు ఇచ్చింది. హర్యానాలో గుర్ గావ్ అనే ప్రాంతంలో డి.ఎల్.ఎఫ్. నిర్మాణ సంస్థకి, వాద్రా సంస్థకి మధ్య జరిగిన లావాదేవీలలో కూడా చాలా అక్రమాలు జరిగినట్లు వార్తలు రావడంతో హర్యానా ముఖ్యమంత్రి ఖత్తర్ దానిపై దర్యాప్తు కోసం జస్టిస్ ఎస్.ఎన్.ధింగ్రా కమీషన్ వేశారు. ఆ నివేదిక కూడా సిద్దంగా ఉంది. కనుక త్వరలో వాద్రా ఊహించని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
సాధారణంగా ఇటువంటి సమయంలో రాజకీయ నాయకులు తమ ఒత్తిడిని కనబడకుండా దాచుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇటువంటి మాటలు చెపుతుంటారు. అయితే రాజకీయ పార్టీలు తనని రాజకీయ మైలేజ్ కోసం వాడుకొంటున్నాయని వాద్రా చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజమని చెప్పవచ్చు.
బ్యాంక్ లాకర్లో ఉన్న తమ విలువైన నగలను మహిళలు పెళ్లిళ్లకు పేరంటాలకి తీసి వాడుకొని మళ్ళీ లోపల పెట్టేసినట్లుగా కాంగ్రెస్ వ్యతిరేకపార్టీలన్నీ కూడా అవసరమైనప్పుడు వాద్రాపై విమర్శలు గుప్పించి, తమ రాజకీయ అవసరాలను పూర్తి చేసుకొంటున్నాయి. అయితే వాటికి ఆ అవకాశం కల్పించింది మాత్రం ఆయనేనని చెప్పక తప్పదు. ఆయన వ్యాపార లావాదేవీలలో పారదర్శకత లేకపోవడం, మీడియాతో మాట్లాడేటప్పుడు అహంభావం ప్రదర్శించడం, రాజకీయాలకు, నేతలకి పూర్తిగా దూరం ఉండలేకపోవడం, అన్నిటికంటే మించి సోనియా గాంధీకి అల్లుడు కావడం వంటి అనేక కారణాల చేత ఆయన పట్ల రాజకీయ పార్టీలలో, దేశ ప్రజలలో కూడా వ్యతిరేకతని, దురాభిప్రాయాన్ని ఏర్పరిచాయి. తనకి ఏర్పడిన ఆ నెగెటివ్ ఇమేజ్ ని ఆయన కూడా గుర్తించినట్లే ఉన్నారు కానీ దానిని తొలగించుకొనేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. పైగా ఎప్పుడు ‘ఐ డోంట్ కేర్’ అన్నట్లుగా ఉండేది ఆయన ప్రవర్తన మాట తీరు. దానిని రాజకీయ పార్టీలు చక్కగా సద్వినియోగం చేసుకొంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయ మైలేజ్ పొందుతున్నాయి. ఆ విషయం కూడా తెలిసి ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఆయన ‘ఐ డోంట్ కేర్’ అన్నట్లుగానే మాట్లాడుతుండటం విశేషమే కదా!