జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొట్టిన దెబ్బకు జగన్కు.. వైసీపీకి నిద్ర రావడం లేదు. ఆరు నెలలు అయిపోయింది ఇంకా పీడకలలే వస్తున్నాయి. అందుకే కాస్త ప్రశాంతంగా ఉండటానికి అయినా పవన్ ను పొగిడి మనసు ప్రశాంతం చేసుకోవాలనుకుంటున్నారు. రోజుకు ఒకరు చొప్పున మీడియా ముందుకు వచ్చి.. పవన్ అద్భుతం అని పొగిడేస్తున్నారు. విజయసాయిరెడ్డితో ప్రారంభించారు. ఇప్పుడు సాక్షి పత్రిక ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పొగుడుతున్నారు.
వైసీపీ విధానం ప్రకారం జగన్ ను మాత్రమే పొగడాలి.. ఇక మిగతా అందర్నీ బూతులు తిట్టాలి. అదీ పవన్ కల్యాణ్ ను అయితే.. ఇక ఉపేక్షించాల్సిన పని లేదు. దత్త పుత్రుడు అనే డైలాగ్ దగ్గర నుంచి పావలా కల్యాణ్ అనే వరకూ అన్ని రకాలుగా వేధించాలన్నది వారి రూల్ బుక్ లోఉంటుంది. మరి ఇప్పుడెందుకు మారిపోయారు. గుడివాడ అమర్ వచ్చి తాము పవన్ వల్లే 164స్థానాల్లో ఓడిపోయామని క్రెడిట్ ఇచ్చేస్తూంటారు. మార్గాని భరత్ కూడా అదే చెబుతారు. ధర్మవరం రెడ్డిగారు కూడా అదే అంటారు. చివరికి అంబటి రాంబాబు కూడా.. పవన్ కల్యాణ్ గారు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్న ఓ పార్టీకి అధ్యక్షుడని ఆయనను అగౌరవపర్చకూడదని అంటున్నారు. ఈ మార్పు ఏంటోనని వైసీపీ వర్గాలు కూడా తల పట్టుకుంటున్నాయి.
పవన్ గొప్పవాడు అయితే మరి జగన్ జీరోనా అని వైసీపీ క్యాడర్ అనుకునేలా పొగుడుతున్నారు. తాజాగా చంద్రబాబును మించిపోతున్న పవన్ అని పత్రికలో రాయిస్తున్నారు. అంటే.. జగన్ రెడ్డి కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లేనని స్వయంగా ఒప్పుకున్నట్లవుతోంది. ప్రత్యేకంగా ప్లాన్ లేకపోతే పొగడరు. ప్లాన్ చేసుకుని మరీ పొగుడుతున్నారు. ఇంతకీ పవన్ ను పొగిడేసి ఏం చేద్దామనుకుంటున్నారు?