రియల్ఎస్టేట్ అంటే ప్రపోజ్డ్ ప్రాజెక్టులు చూపించి వ్యాపారం చేయడమేనని చాలా మంది అనుకుంటారు. అదిగో ఫలానా చోట పరిశ్రమ రాబోతోందని తెలిస్తే చాలా మంది ఆ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే లక్ష పెట్టి కొంటే… పది లక్షలు అవుతుందన్న నమ్మకం. ఆ స్థాయిలో డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టినా పెరగవు. అదే రియల్ ఎస్టేట్లో ఉండే మ్యాజిక్.
హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ కారణంగా డిమాండ్ పెరిగిపోయిన ఏరియాలు చాలా ఉన్నాయి. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అమనగల్. నిజానికి ఇది హైదరాబాద్కు దూరమే. కానీ ఇప్పుడు దగ్గరవుతోంది. రీజనల్ రింగ్ రోడ్ ను ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ అమన్ గల్ దగ్గర ఓ జంక్షన్ ప్రపోజ్ చేసింది. అందుకే ఇక్కడ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి కూడా ఇది దగ్గర కావడంతో ఇక పెరగనున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అమన్ గల్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ పరంగా దూకుడుగా ఉంది. ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కాస్త దూరం అయినప్పటికీ స్థలాలు కొనేవాళ్లు ఎక్కువ మంది వస్తున్నారు. భవిష్యత్ లో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది మార్కెట్ రేటు కన్నా రూపాయి ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నారు.
గతంలో కడ్తాల్ వద్ద ప్లాట్లకే పెద్ద డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అమన్ గల్లో కూడా.. గజం పాతిక వేలు పలుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఓ పదేళ్లు ఎదురుచూడగలిగే అవకాశం ఉన్న వారికి ఆమనగల్లు ఏరియా మంచి అవకాశం అవుతుందని అంచనా వేస్తున్నారు.