UI movie review upendra
తెలుగు360 రేటింగ్: 1/5
కమర్షియల్ సినిమాని చూడ్డానికి వచ్చే ప్రేక్షకులు లాజిక్కులు అడక్కండి.. మైండ్ని ఇంట్లోనే పెట్టి థియేటర్లలోకి అడుగుపెట్టండి.. అని కొంతమంది సరదాగా చెబుతుంటారు. కానీ ఉపేంద్ర సినిమాకు వెళ్తున్నప్పుడు రెండు మూడు బుర్రలు తీసుకొని వెళ్లాలేమో. ఎందుకంటే ఆయన సినిమాల్లో అన్ని `పొరలు` ఉంటాయి. మెటాఫర్లతో చెడుగుడు ఆడుకొంటాడు. ఆయన తెరపై ఏదో చూపిస్తుంటాడు. ప్రేక్షకుడికి ఏదో అర్థం అవుతుంది. ఉపేంద్ర సైకాలజీ కూడా అదే. సినిమాని చూసేవాళ్లు ఎవరి కోణంలో వాళ్లు అర్థం చేసుకోవాలన్నది ఆయన ఫిలాసఫీ. ఇప్పుడాయన UI అనే ఓ సినిమా తీశాడు. ఈ టైటిల్ కి అర్థం ఏమిటి? ఇందులో ఏం చెప్పబోతున్నారు? అని ఉపేంద్రని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. సినిమా చూసి తెలుసుకోండి, టైటిల్ కి ఎవరి నిర్వచనం వాళ్లు ఇచ్చుకోండి అంటూ తెలివిగా దాటేశారు. మరి సినిమా చూసినవాళ్లకైనా ఉపేంద్ర ఏం చెప్పబోయాడో అర్థమైందా? లేదా?
ఈ సినిమా కథేంటి? అనేది అడిగితే.. టక్కున చెప్పలేని పరిస్థితి. గొప్ప సినిమాలకూ, పరమ చెత్త సినిమాల విషయాలలోనే అది జరుగుతుంది. UI అయితే తొలి కోవకు చెందిన సినిమా అయితే కచ్చితంగా కాదు. రెండో జాబితాలో చేరుతుందో, చేరదో.. సినిమా చూశాక ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. దొంగలే రాజ్యాలు ఏలుతున్న కాలంలో.. అందర్నీ దారిలో పెట్టడానికి సత్య (ఉపేంద్ర) వస్తాడు. తన మంచితనంతో ప్రజల్ని తనవైపు తిప్పుకొంటాడు. అదే సమయంలో కల్కి (ఉపేంద్ర) కూడా రంగ ప్రవేశం చేస్తాడు. అధికారం హస్తగతం చేసుకొంటాడు. అసలు వీరిద్దరూ ఎవరు? ఎవరు ఏ ధర్మాన్ని పాటించారు? చివరికి ఏది గెలిచింది? అనేది కథ. బహుశా.. ఈ సినిమాని చూసిన అందరికీ కథ ఇలానే అర్థమై ఉండకపోవొచ్చు. చెప్పాం కదా.. ఉపేంద్ర మెటాఫర్లని ఎక్కువగా వాడాడని. ఎవరికి అర్థమైన కథ.. వాళ్లు ఊహించుకోవొచ్చు.
ఉపేంద్ర సినిమాలన్నీ గమ్మత్తుగా మొదలవుతాయి. A సినిమాకెళ్తే.. మొదలైన కాసేపటికే శుభం కార్డు వేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ సినిమాలో ప్రారంభంలోనే ‘మీరు తెలివైన వాళ్లయితే ఇప్పుడే బయటకు వెళ్లిపోండి. మూర్ఖులైతే సినిమా మొత్తం చూడండి’ అంటూ ఓ కార్డ్ వేసి హడలుగొట్టేస్తాడు. ‘తెలివైన వాళ్లు మూర్ఖుల్లా కనిపిస్తారని, మూర్ఖులు తెలివైన వాళ్లలా నటిస్తారని’ ఇంకో కొత్త సవరణ చేసి ప్రేక్షకుల్ని అరెస్ట్ చేస్తాడు. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ సైతం తన ఇష్టమొచ్చినట్టు మార్చేశాడు ఉపేంద్ర. అలా తనదైన మ్యాజిక్ తొలి సన్నివేశాలతోనే మొదలైపోతుంది.
ఉపేంద్ర అనే దర్శకుడు తీసిన సినిమా చూసిన జనాలు పిచ్చెక్కిపోతారు. ‘ఫోకస్’ దొరికినవాళ్లు సమాజాన్ని అర్థం చేసుకొనే కోణం మారి, విచిత్రమైన నిర్ణయాలు తీసుకొంటారు. ఉపేంద్ర తీసిన సినిమా సన్సేషనల్ అయిపోతుంది. రివ్యూ రైటర్లకు ఏం రాయాలో అర్థం కాదు. సినిమా ఇండస్ట్రీని రివ్యూలతో శాశించే తరణ్ ఆదర్శ్ లాంటి జర్నలిస్టు ఈ సినిమాని అర్థం చేసుకోవడానికి కనీసం మూడేళ్లయినా పడుతుందని తల పట్టుకొంటాడు. ఇలాంటి ఇంట్రస్టింగ్ సినారియోతో కథని మొదలెట్టి.. అక్కడి నుంచి కలియుగంలోకి వెళ్లిపోయాడు ఉపేంద్ర. అక్కడ పరిపాలన ఎలా ఉంది? ప్రజల ఆలోచనా ధోరణి ఎలా సాగుతుంది? అనే విషయాల్ని చూపించాడు. ఉపేంద్ర మెటాఫర్లో బాగా రిజిస్టర్ అయ్యేది మాత్రం గ్లోబల్ వార్మింగ్. భూదేవి ఇది వరకు పచ్చగా, అందంగా, ఆరోగ్యవంతంగా ఉండేదని కానీ మైనింగ్ మాఫియా, మెడిసిన్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా… భూగోళాన్ని నాశనం చేశారని, కాలుష్యానికి కారణమయ్యారన్న విషయాన్ని చెప్పాలనుకొన్నాడు. భూమాతకు పుట్టిన బిడ్డలే కల్కి, సత్య. కల్కి తన తల్లికు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. అందుకు ఏం చేశాడన్నది సినిమా అంతా చూస్తే అర్థం అవుతుంది. కొన్ని చోట్ల పొలిటికల్ సెటైర్లు పడతాయి. ఇంకొన్ని చోట్ల మనిషి నైజంతో ఆడుకొంటాడు ఉపేంద్ర. చివర్లో సినిమా వాళ్లపైనా కొన్ని సెటైర్లు పడ్డాయి.
సినిమా అంతా గందరగోళం. ఓ సన్నివేశానికీ, మరో సన్నివేశానికీ పొంతన ఉండదు. అసలు ఉపేంద్ర ఏం ఆలోచించాడు? ఏం చెప్పదలచుకొన్నాడు? అనే విషయాలు మిగిలిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకైనా తెలుసో, లేదో అర్థం కాదు. ఈ సినిమాలో ఓ చోట రివ్యూ రైటర్లని చూపించాడు ఉపేంద్ర. వాళ్లంతా సినిమా చూసి బట్టలు చించుకొని రివ్యూలు చెబుతారు. తలని ముక్కలు ముక్కలుగా నరికి, ఎదురుగా ఉన్న ప్లేట్లో పెట్టి, అప్పుడు రివ్యూలు చెబుతారు. నిజానికి ఈ సినిమా చూసిన రివ్యూ రైటర్ల, సామాన్య ప్రేక్షకుల పరిస్థితి కూడా అదేనేమో అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా ఉపేంద్ర చెప్పదలచుకొన్న పాయింట్ ప్రేక్షకులకూ అర్థం కావడానికి పది పదిహేను సార్లు చూడాలేమో. తొలిసారికే ఓపిక నశించిపోయే ప్రేక్షకుడు మళ్లీ అలాంటి సాహసం ఎందుకు చేస్తాడు? తొలి సగం పూర్తయ్యేసరికి థియేటర్ల నుంచి పారిపోదాం అనే ఆలోచన ప్రేక్షకుడికి రావడం సహజం. కానీ ఉపేంద్రపై ఉన్న గౌరవంతో చివరి వరకూ చూసిన వాళ్లు.. నిజంగానే థియేటర్ బయటకు వచ్చేటప్పుడు పిచ్చి చూపులు చూస్తూనో, హాహాకారాలు చేస్తూనో వస్తారు. అది మాత్రం గ్యారెంటీ.
ఉపేంద్ర ఎప్పట్లా పిచ్చిపిచ్చిగా చేసుకొంటూ వెళ్లిపోయాడు. క్యారెక్టర్ ఆర్క్ లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఉపేంద్రకు సైతం కోపం వస్తుంది. ఉపేంద్ర తప్ప ఎవరూ ఇలా ఆలోచించలేరు, ఎవరూ ఇలా నటించలేరన్నది మాత్రం చెప్పగలం. తెరంతా ఉపేంద్ర, మైండ్ అంతా ఉపేంద్ర ఆక్రమించేసుకొన్నాక.. మిగిలిన నటుల గురించి ఏం మాట్లాడతాం? హీరోయిన్ ఉందా అంటే ఉందంతే. తన క్యారెక్టరైజేషన్ ఉపేంద్ర కంటే పిచ్చిపిచ్చిగా ఉంది. రవిశంకర్ వెరైటీ గెటప్పులతో కనిపించాడు.
ఉపేంద్ర తనకు నచ్చినట్టు రాసుకొని, తీసుకొన్నాడు. ఉపేంద్ర ఏమంటాడో అని భయపడిన ఎడిటర్ తీసిందంతా శ్రద్దగా కట్ చేసి పెట్టాడు. అయితే ఇవన్నీ ప్రేక్షకులకు అర్థం అవుతాయా, నచ్చుతాయా లేదా అని మాత్రం ఆలోచించలేదు. ప్రేక్షకుల ఊహా శక్తి గొప్పది. వాళ్లు మరీ అమాయకులు కాదు. అర్థం చేసుకోకపోవడం అంటూ ఏమి ఉండదు.. అనేది ఉపేంద్ర మాట. అయితే అలాంటి ప్రేక్షకులు కూడా ఈ సినిమా అర్థం కాక.. పిచ్చి చూపులు చూసుకోవడం ఖాయం. ఆ స్థాయిలో ఉంది స్క్రీన్ ప్లే. లొకేషన్లు వెరైటీగా ఉన్నాయి. కలియుగం వరల్డ్ ని నిజంగానే కొత్త పంధాలో చూపించారు. ఆ విషయంలో ఆర్ట్ విభాగానికి మార్కులు పడతాయి. పాటలు, వాటిలో సాహిత్యం గురించి మాట్లాడుకోలేం. ఆర్.ఆర్లో అక్కడక్కడ… సెక్సీ మూలుగులు వినిపిస్తుంటాయి. మరి దానికి ఉపేంద్ర అనుకొన్న మెటాఫర్ ఏమిటో మరి! మొత్తానికి ప్రేక్షకుల మైండ్ని డిస్ట్రబ్ చేసి, అలసటకు, అయోమయానికీ గురి చేసిన సినిమాల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది.
తెలుగు360 రేటింగ్: 1/5