తెలంగాణా న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం నానాటికీ తీవ్రం అవుతోంది. న్యాయవ్యవస్థలో ఉన్నవారే న్యాయం కోరుతూ హైకోర్టుతో యుద్ధం చేస్తున్నారు. హైకోర్టు విభజన, ఉద్యోగుల ప్రాధమిక కేటాయింపుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ మొదలైన యుద్ధం ఇప్పుడు హైకోర్టు వైఖరిని నిరసించడానికి జరుగుతోంది. అనేక సంక్లిష్టమైన సమస్యలని పరిష్కరించిన హైకోర్టు వారిని దారిలో పెట్టలేక సతమతమవుతోంది.
చట్టాన్ని అమలుచేయవలసిన బాధ్యత హైకోర్టు భుజస్కంధాలపైనే ఉన్న కారణంగా అది క్రమశిక్షణ ఉల్లంఘించి సమ్మె చేస్తున్న ఉద్యోగులు, న్యాయాధికారులపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకొంటోంది. అదే కారణంతో మరో 11 మంది ఉద్యోగులని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ కూకట్ పల్లి, ఇబ్రహీపట్నం కోర్టులకి చెందిన 60 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. అయితే ఇంతవరకు రాజీనామాలు చేస్తున్నవారెవరూ తమ రాజీనామా లేఖలని హైకోర్టుకి సమర్పించకుండా తమ సంఘాల అధ్యక్షులకో, ప్రధాన కార్యదర్శులకో సమర్పిస్తున్నారు. ఒకవేళ వారు తమ రాజీనామా లేఖలని హైకోర్టుకి సమర్పించి ఉండి ఉంటే వాటిని అది ఆమోదించి ఉంటే వాటిని ఇక వెనక్కి తీసుకొనే అవకాశం కూడా ఉండదు. అప్పుడు పరిస్థితి మరింత భయానకంగా తయారయ్యి ఉండేది.
ప్రజలకి న్యాయం చెప్పాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఉద్యోగులు, హైకోర్టు వారిలో వారే ఈవిధంగా కీచులాడుకొంటూ అందరూ కలిసి న్యాయవ్యవస్థని బజారుకీడ్చారని చెప్పకతప్పదు. రిటర్డ్ న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఉద్యోగులు కూడా వచ్చి కలస్తుండటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. రాజకీయంగా పరిష్కరించగల ఈ సమస్యని అధికారంలో ఉన్న నేతలు పట్టించుకోకపోవడం వలననే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. ప్రజలని చైతన్యవంతులు అవ్వాలని నిత్యం సుద్దులు చెప్పే ప్రభుత్వాలు, నానాటికీ పరిస్థితి విషమిస్తుంటే యుద్ద ప్రాతిపదికన దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా, అందరూ తలోరాయి విసురుతున్నారు. యధాప్రకారం ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఇంత జరుగుతున్న వారు ఇంకా మేల్కొన్నట్లు కనిపించడం లేదు.
వారి నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణాలో న్యాయవ్యవస్థ రెండుగా చీలిపోయింది. దానిలో ఉద్యోగులు, న్యాయమూర్తులందరూ ఒకవైపు, హైకోర్టు ఒకటి మరొకవైపు నిలిచి యుద్ధం కొనసాగించవలసిన దౌర్భాగ్య పరిస్థితిని చూడవలసి వస్తోంది. ఈ సమస్య ఇంకా ఎప్పటికి పరిష్కారం అవుతుందో, ఆలోగా ఇంకా ఎటువంటి అవాంచనీయమైన పరిణామాలని చూడవలసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇందుకు న్యాయవ్యవస్థలో ఉన్నవారిని నిందించడం కంటే ఈ సమస్యని పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే నిందించవలసి ఉంటుంది. కనీసం ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఈ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేసయవలసిన అవసరం చాలా ఉంది.