విశాఖ డెయిరీలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభాసంఘం వేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటు అయిన ఆ సభాసంఘం విశాఖ డెయిరీకి వెళ్లి విచారణ జరిపింది. డెయిరీ ఆస్తుల స్వాహా సహా చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సభా సంఘం మరికొంత విచారణ జరిపి.. నివేదిక రెడీ చేసి..అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించనుంది.
ఈ లోపు విశాఖ డెయిరీ చైర్మన్ అడారీ ఆనంద్ తో పాటు తొమ్మిది మంది సభ్యులు రాజీనామాలు చేశారు. అయితే వారు రాజీనామాలు చేసింది విశాఖ డెయిరీకి కాదు… వైసీపీకి. డెయిరీకి పూర్తి సమయం కేటాయించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని రాజీనామా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ డైరక్టర్లలో ఒకరు యలమంచిలి మున్సిపల్ చైర్మన్ కూడా ఉన్నారు. వీరంతా బీజేపీతో టచ్ లోకి వెళ్లి తమ పదవుల్ని కాపాడుకోవడానికి ఆ పార్టీ భరోసా తీసుకుని వైసీపీకి రాజీనామా చేశారని అంటున్నారు.
అడారి ఆనంద్ కుటుంబం.. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా ఉన్నారు. వారి కుటుంబానికి విశాఖ డెయిరీపై పట్టు ఉంది. అందుకే 2019లో అనకాపల్లి పార్లమెంట్ సీటును అడారి ఆనంద్ కు ఇచ్చారు. వైసీపీ గెలవగానే ఆ పార్టీలో చేరిపోయారు. పదవిని కాపాడుకున్నారు. జగన్ ఓ అసెంబ్లీ సీటును కూడా ఇచ్చారు. కానీ ఆయన కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఓడిపోయిన తర్వాత జనసేన లో చేరాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ స్పందన రాలేదు. ఈ లోపు అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అందుకే తీవ్ర ప్రయత్నాలు చేసి బీజేపీ మద్దతు కూడగట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.